ఆజాద్ స్థానంలో దిగ్విజయ్, శాశ్వత సభ్యుడిగా కావూరి

Kavuri Sambhasiva Rao - Digvijay Singh
న్యూఢిల్లీ: ఎన్నికలకు ఏడాది ముందు సిడబ్లుసి, ఏఐసిసి పునర్వ్యవస్థీకరణ జరిగింది. అందులో ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ మార్క్ కనిపించింది. కాంగ్రెసు అనుబంధ పగ్గాలు రాహుల్‌కు అప్పగించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న గులాం నబీ ఆజాద్‌ను పక్కన పెట్టి.. దిగ్విజయ్ సింగ్‌కు పగ్గాలు అప్పగించారు. దిగ్విజయ్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా రావడం ఇది మూడోసారి. ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావుకి సిడబ్లుసిలో శాశ్వత ఆహ్వానితుడి హోదా దక్కింది.

కాంగ్రెసులో మార్పులే కాకుండా సోమవారం కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు కూడా సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో గుండెకాయ వంటి ఆంధ్రప్రదేశ్‌పై తామిప్పటికీ ఆశలు వదులుకోలేదని స్పష్టంచేస్తూ, పదవుల్లో రాష్ట్రానికి పెద్దపీట వేసిందనే చెప్పవచ్చు. సిడబ్ల్యూసిలో, ఏఐసిసిలో భారీ మార్పులు చేసి... యువకులకు, సీనియర్లకు సమాన బాధ్యతలు అప్పగిస్తూనే కొంతమంది పాత నాయకులకు చెయ్యిచ్చింది.

రాహుల్ గాంధీ పార్టీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తూనే గతంలో మాదిరిగా అనుబంధ సంఘాల బాధ్యతలను కూడా పర్యవేక్షిస్తారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ స్థానం చెక్కు చెదరకపోగా.. అంబికా సోనీకి కాంగ్రెస్ అధ్యక్షురాలి కార్యాలయ బాధ్యతలతోపాటు మరో మూడు రాష్ట్రాల బాధ్యతలను కూడా అప్పగించారు. మోతీలాల్ వోరా ఎప్పట్లాగే కోశాధికారిగా ఉంటారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీలను ప్రకటించారు.

కమిటీ చైర్మన్లుగా సిపి జోషి, వి.నారాయణ సామి, మధుసూధన్ మిస్త్రీ, మోహన్ ప్రకాశ్, అజయ్ మాకెన్‌లను నియమించారు. సిడబ్లుసిలో సీనియర్లతోపాటు అజయ్ మాకెన్, షకీల్ అహ్మద్ వంటి యువ నేతలకు స్థానం కల్పించారు. సీడబ్ల్యూసీలో 15 మంది శాశ్వత ఆహ్వానితుల జాబితాలో రాష్ట్రం నుంచి కావూరి సాంబశివరావుకు స్థానం కల్పించారు. గతంలో ఈ హో దాలో నేదురుమల్లి జనార్దన రెడ్డి ఉండేవారు.

రాష్ట్రానికి చెందిన మరో నేత, ట్రేడ్ యూనియన్ నాయకుడు సంజీవ రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చేర్చారు. ప్రధాన కార్యదర్శులుగా రాష్ట్రం నుంచి ఎవరికీ అవకాశం కల్పించలేదు. పైగా, పొంగులేటి సుధాకర్ రెడ్డిని కార్యదర్శి పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన చిన్నా రెడ్డికి అవకాశం కల్పించారు. వి హనుమంత రావును కార్యదర్శిగా కొనసాగిస్తూనే.. ప్రధాన కార్యదర్శులు ఎవరికీ ఆయనను అనుబంధంగా చేర్చలేదు.

పార్టీ నాయకత్వం ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చేందుకు వీలుగా కార్యదర్శిగా కొనసాగేందుకు ఆయనకు అవకాశం ఇచ్చారు. విహెచ్‌తోపాటు అవతార్ సింగ్ భడనాలను నేరుగా కాంగ్రెస్ అధ్యక్షురాలికి నివేదించే కార్యదర్శులుగా నియమించారు. గులాం నబీ ఆజాద్‌ను, ఆయనతోపాటు కార్యదర్శి కేబీ కృష్ణమూర్తిని పూర్తిగా రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించి దిగ్విజయ్ సింగ్‌కు ఆ బాధ్యతలను అప్పగించింది. తద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతాయన్న సంకేతాలను కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చినట్టయింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, గోవా బాధ్యతలను కూడా డిగ్గీ రాజా నిర్వహిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+