దిగ్విజయ్: వైయస్ వర్గం మచ్చిక, తెలంగాణపై సస్పెన్స్

Digvijay Singh as AP Congress incharge
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా గులాం నబీ ఆజాద్ స్థానంలో దిగ్విజయ్ సింగ్‌ను నియమించడం వెనుక కాంగ్రెసు పార్టీ వ్యూహమేమిటనే చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రధానంగా కాంగ్రెసులో కొనసాగుతోంది. దిగ్విజయ్ నియామంకపై కాంగ్రెసు నేతల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. దిగ్విజయ్‌కు రాష్ట్ర రాజకీయాలపై మంచి పట్టు ఉంది. నేతల గురించి తెలుసు. తెలంగాణ గురించి తెలుసు. అలాగే వైయస్ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలున్నాయి.

అన్నిటినీ నాన్చుతూ అస్మదీయులను, గ్రూపులను పెంచి పోషిస్తున్నారని భావించడం వల్లే ఆజాద్ స్థానంలో దిగ్విజయ్‌‍ను అధిష్ఠానం రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది. ఆయన రాకతో రాజకీయాలు మలుపు తిరగనున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. దిగ్విజయ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకిగా ముద్రపడ్డారు. దీంతో తెలంగాణ కాంగ్రెసు నేతల్లో ఆందోళన కనిపిస్తోందనే చెప్పవచ్చు.

దిగ్విజయ్ నియామకాన్ని రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలు స్వాగతించారు. ఆయన రాకతో పార్టీ బలోపేతమవుతుందని, 2014 ఎన్నికల్లో విజయం సాధిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు మాత్రం దిగ్విజయ్ రాకను స్వాగతించడం లేదని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే తెలంగాణలో నక్సలిజం ప్రబలుతుందని, మరో ఛత్తీస్‌గఢ్ అవుతుందని పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో దిగ్విజయ్ పలుమార్లు చెప్పారని గుర్తు చేసుకుంటున్నారట. చిన్న రాష్ట్రాల విషయంలో రెండో ఎస్సార్సీ వైపు దిగ్విజయ్ మొగ్గు చూపుతున్నారు. అవసరమైతే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాకను తెలంగాణ కాంగ్రెసు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు.

కాగా, దిగ్విజయ్ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్రాన్ని వేధిస్తున్న కీలక సమస్యలపై వేగంగా పావులు కదుపుతారని, అందుకే ఎన్నికల సమయంలో సోనియా ఆయనను నియమించారని తెలుస్తోంది. తనకు సన్నిహితుడైన దిగ్విజయ్‌ను రాహుల్ స్వయంగా రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించాల్సిందిగా కోరారని తెలుస్తోంది. అయితే, ఉత్తరప్రదేశ్‌లో పెద్దగా విజయం సాధించని దిగ్విజయ్ ప్రస్తుతం ఎంతో సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కించగలరని ఆయన ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్న తన సొంత రాష్ట్రం మధ్య ప్రదేశ్ రాజకీయాల్లో ఆయన తలదూర్చాల్సిన అవసరం ఉన్న రీత్యా ఆంధ్ర ప్రదేశ్‌పై దృష్టి కేంద్రీకరిస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక సమస్యను పరిష్కరించే విషయంలో దిగ్విజయ్ శైలి వేరుగా ఉంటుందని, రాష్ట్రంలో ఇప్పటి వరకూ అస్పష్టంగా ఉన్న కొన్ని అంశాలకు ఆయన స్పష్టతనిస్తారని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఇన్‌చార్జిగా ఉన్న ఆజాద్.. తెలంగాణకు అనుకూలంగా ఉన్నారు.

బొత్సను ప్రోత్సహించారు. గతంలో వైయస్‌కు ఆజాద్ సన్నిహితంగా ఉన్నప్పటికీ స్వతంత్రంగా వ్యవహరించేందుకు ప్రయత్నించారు. కానీ, దిగ్విజయ్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. తెలంగాణ సమస్యపై ఆయనకు స్పష్టత ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధిపరంగా ముందుకు తీసుకుపోగలిగిన ఆకర్షణీయమైన నాయకుడు ఉంటే ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని గతంలో ఆయన భావించారు. అయితే తెలంగాణ విషయంలో ఇప్పుడు ఆయన ఏవిధంగా వ్యవహరిస్తారో చెప్పలేమని పరిశీలకులు భావిస్తున్నారు.

రాష్ట్ర సమస్యలపై ఆంటోనీ నేతృత్వంలో సోనియా నియమించిన కమిటీలో దిగ్విజయ్ సభ్యుడు. తెలంగాణకు ప్యాకేజీ ఇచ్చే విషయంపై దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ సుముఖంగా ఉన్నారని, ఈ అభిప్రాయంతో వారు రాహుల్ గాంధీని ప్రభావితం చేశారని తెలుస్తోంది. ఇక వైయస్ కుటుంబంతోనూ దిగ్విజయ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి.

కెవిపికి సన్నిహితుడు

వైయస్ ఆత్మ అయిన కెవిపికి దిగ్విజయ్ అత్యంత సన్నిహితుడు. కిరణ్ కుమార్ రెడ్డికి కూడా దిగ్విజయ్ సన్నిహితుడే. కిరణ్‌కు అనుయాయుడైన రంగారెడ్డి దిగ్విజయ్‌కు శిష్యుడు. ఈ నేపథ్యంలో, తెలంగాణ, ఇతర అంశాలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలు అమలు చేసేటప్పుడు వైయస్ అనుయాయుల ప్రయోజనాలను కాపాడతామన్న హామీ ఇచ్చేందుకే దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దించారని, భావి రాజకీయ సమీకరణాలకు ఆయన తోడ్పడతారని పరిశీలకులు భావిస్తున్నారు. వైయస్ వర్గాన్ని మచ్చిక చేసుకొని సీమాంధ్రలో దిగ్విజయ్ కాంగ్రెసును గట్టెక్కించగలరని భావిస్తున్నారు. అయితే తెలంగాణ విషయంలో ఏం చేస్తారనేది ప్రశ్నగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+