ఉత్తరాఖండ్ వరద విలయం: మృతులు 5 వేలపైనే
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ప్రకృతి భీభత్సంలో 5 వేలమందికి పైగానే మరణించి ఉండవచ్చునని రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నివారణ శాఖ మంత్రి యశ్‌పాల్ ఆర్య ఆదివారం ప్రకటించారు. వరద ప్రాంతాల్లో ఇప్పటికీ చిక్కుకున్న సుమారు 12 వేలమందిని ఆదివారం సహాయక బృందాలు రోడ్డు, విమాన మర్గాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఇంకా పది వేల మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంది. ఆదివారం అప్పుడప్పుడు వర్షం కురుస్తున్నా సహాయచర్యలు ఆగలేదు.

సహాయక చర్యల కారణంగా కేదార్‌నాథ్ ప్రాంతంలో ఇంకా చిక్కుపడి ఉన్న 12 వేలమంది యాత్రికులు, టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.దీంతో కేదార్‌నాథ్ లోయలో చిక్కుకుపోయిన వారినందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టయ్యింది. సోమవారం నుంచి ఈ ప్రాంతంలో వర్షాల కారణంగా ప్రతికూల వాతావరణం ఉంటుందని వాతావరణ విభాగం హెచ్చరించిన నేపథ్యంలో సైన్యం, భారత వైమానిక దళం, ఐటిబిపి, ఎన్‌డిఆర్‌ఎఫ్ లాంటి భద్రతా దళాల విభాగాలతోపాటు స్థానిక పోలీసులు, ఇతర సహాయక బృందాలు బదరీనాథ్ సహా ఈ ప్రాంతంలో ఇప్పటికీ చిక్కుపడి ఉన్న 10వేల మందికి పైగా యాత్రికులను కాపాడడానికి ప్రాధాన్యం ఇచ్చాయి.
అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 680 కాగా, మృతుల సంఖ్య దాదాపుగా వెయ్యిదాకా ఉండవచ్చునని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ చెప్పడం తెలిసిందే. అయితే కచ్చితంగా ఎంతమంది చనిపోయారో చెప్పలేమని, ఎందుకంటే వేలాది టన్నులున్న భవనాల శిథిలాల కింద ఎన్ని మృతదేహాలు ఉన్నాయో తెలియదని, శిథిలాలను తవ్వి పోయడానికి మరికొంత సమయం పట్టవచ్చని మంత్రి చెప్పారు. ఆదివారం సురక్షిత ప్రాంతాలకు తరలించిన 12 వేలమందితో కలుపుకొని ఇప్పటివరకు 80 వేలమందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ఇంకా పదివేల మంది దాకా వివిధ ప్రాంతాల్లో చిక్కుపడి ఉన్నారని పత్రికా సమాచార విభాగం (పిఐబి) డైరెక్టర్ జనరల్ నీలమ్ కపూర్ ఢిల్లీలో చెప్పారు.
భారత వైమానిక దళానికి చెందిన 45 హెలికాప్టర్లు 250 ట్రిప్పులు తిరిగి వివిధ ప్రాంతాల్లో చిక్కుపడి ఉన్న 3,200 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు రక్షణ శాఖ ప్రకటనలో తెలిపింది. కాగా కొండలు, గుట్టల్లో చిక్కుపడి ఇప్పటికీ సహాయం కోసం ఎదురుచూస్తున్న వారిని గుర్తించడం కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ తన పైలట్ రహిత విమానం ‘నేత్ర'ను కూడా రంగంలోకి దింపింది. ఇంత భారీఎత్తున ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం భద్రతా దళాలకు చెందిన వివిధ విభాగాలు వందల సంఖ్యలో తాళ్ల వంతెనలు, కాలిబాటలను కూడా నిర్మించాయి.
ఆదివారం సైన్యం కేదార్‌నాథ్ ప్రాంతంలో చిక్కుకుపోయి ఉన్న మొత్తం యాత్రికులు, ఇతర ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిందని, బదరీనాథ్ జంగిల్‌చట్టి, హర్షిల్ తదితర ప్రాంతాల్లోని 3 వేలమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమ, మంగళవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడం తమకు ప్రధానంగా ఆందోళన కలిగిస్తోందని, సోమవారం గనుక మూడు నాలుగు గంటలు వర్షం కురవకుండా ఉంటే పెద్ద సంఖ్యలోనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించగలుగుతామని ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్‌మార్షల్ ఎస్‌డి దేవ్ న్యూఢిల్లీలో చెప్పారు.












Click it and Unblock the Notifications