ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్షం: సహాయక చర్యలకు గండి
డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్షం పడుతోంది. కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో సహాయక చర్యలకు సోమవారం విఘాతం ఏర్పడింది. పౌరీ, చమోలీ, రుద్రప్రయాగ వంటి ఎత్తయిన ప్రదేశాల్లో కూడా సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇంకా పది వేల మంది దాకా చిక్కుకుపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.
బద్రీనాథ్, దాని పరిసరాల్లోని ప్రజలను తరలించడానికి సోమవారం ఉదయం నుంచి సహస్రధార హెలిపాడ్ నుంచి ఒక్క హెలికాప్టర్ కూడా వెళ్లలేకపోయింది. గుప్తకాశీ, గౌచార్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. విడతలు విడతలుగా వర్షం పడుతుండడం వల్ల, మంచు కప్పి ఉన్నందున హెలికాప్టర్లు వెళ్లలేకపోతున్నాయి.

బద్రీనాథ్‌లో దాదాపు 5 వేల మంది చిక్కుకుని ఉన్నారని, వారిని తీసుకురావడానికి ఒక్క హెలికాప్టర్ కూడా వెళ్లలేకపోయిందని రిటైర్డ్ వింగ్ కమాండర్ కెప్టెన్ ఆర్ఎస్ బ్రార్ చెప్పారు. వాతావరణం తెరిపి ఇస్తుందనే ఆశతో తీసుకుని వెళ్లడానికి తాను హెలికాప్టర్‌లో కూర్చుని ఉన్నానని చెప్పారు. ఆయనే హెలికాప్టర్ల ద్వారా ప్రజలను తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
బద్రీనాథ్ జాతీయ రహదారిపై తాజాగా కొండ చరియలు విరిగి పడ్డాయి. బాధిత ప్రజలకు మందులు, ఆహారం పొట్లాలు అందుబాటులో ఉన్నాయని, దాని గురించి చింతించాల్సిన అవసరం లేదని బ్రార్ చెప్పారు. కేదార్‌నాథ్ లోయలో ఇంకా ఎవరైనా చిక్కుపడి పోయారా అనే విషయం తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టింది.












Click it and Unblock the Notifications