షర్మిల యాత్ర: నిన్న దాడి, నేడు కొణతాల రామకృష్ణ

అనకాపల్లి రాజకీయాల నేపథ్యంలో దాడి తెలుగుదేశం పార్టీ నుండి జగన్ పార్టీలోకి వచ్చాక కొణతాల పలు కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. బుధవారం దాడి వీరభద్ర రావు షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. గురువారం కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. తద్వారా ఆయన తన అసంతృప్తిని వీడినట్లుగా కనిపిస్తోంది. కొణతాలకు అధిష్టానం నుండి పూర్తిగా హామీ వచ్చినట్లుగా చెబుతున్నారు. దాడి తనయుడు రత్నాకర్ కూడా తన అనుచరులతో పాల్గొని హల్ చల్ చేశారు. జగన్ పాలనతోనే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని అన్నారు.
ప్రస్తుత కిరణ్ పథకాలు ప్రజల సంక్షేమం కోసం పెట్టిన పథకాలు కావని, ఎన్నికలు వస్తున్న వేళ పెట్టిన ఎన్నికల పథకాలని, పథకాలు ప్రజలకు అందకపోయినా పర్లేదు గానీ ప్రచారానికి పనికొస్తే చాలనుకున్నారని మండిపడ్డారు. అందుకే ఇమేజ్‌ను పెంచుకోవడానికి చేస్తున్న ఈ ప్రచారానికి ఏకంగా రూ.100 కోట్ల ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారని, రేషన్ దుకాణం ద్వారా ఇప్పటిదాకా ఇస్తున్న సరుకులకు కత్తెర వేసి, అమ్మహస్తం అంటూ ఒక పొట్లంలో కొన్ని సరుకులు వేసి, దాని మీద సిఎం తన బొమ్మ వేసుకుంటున్నారన్నారు.
పెట్టిన పథకాలు అమలు కావాలంటే చిత్తశుద్ధి ఉండాలన్నారు. ప్రజల మీద వీసమంతైనా ప్రేమ ఉండాలన్నారు. పేదల మీద గుప్పెడంతైనా కనికరం ఉండాలని, పథకాలు అమలు చేసేవారిలో నిజాయితీ ఉండాలని, అప్పుడే అవి కోట్ల మంది ప్రజలకు అందుతాయని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి తన పథకాలను అలా అమలు చేసి చూపించారు కాబట్టే ఆయన వంటి నాయకుడే తమకు మళ్లీ కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications