జై కాంగ్రెస్.. జై తెలంగాణ: కెసిఆర్, జగన్, బాబుపై ఫైర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెసు పార్టీ ద్వారానే సాధ్యమని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నేతలు అన్నారు. హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో ఆదివారం తెలంగాణ సాధన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెసు నేతలు ఎప్పుడు ముందున్నారన్నారు. ఈ సభకు భారీగా కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, నేతలు తరలి వచ్చారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ సభకు డి.శ్రీనివాస్, దామోదర రాజనర్సింహ, జానా రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, కోమటిరెడ్డి సోదరులు, బలరాం నాయక్, వి హనుమంత రావు, షబ్బీర్ అలీ, సబితా ఇంద్రా రెడ్డి, డికె అరుణ, అంజన్ కుమార్ యాదవ్, శ్రీధర్ బాబు, సురేష్ రెడ్డి తదితరులు చాలామంది నేతలు వచ్చారు. సభకు జగ్గారెడ్డి, దామోదర రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వర్గం నాయకులు పలువురు రాలేదు. ఈ సమావేశంలో నేతలంతా కాంగ్రెసు ద్వారానే తెలంగాణ సాధ్యమన్నారు. పలువురు నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా జగన్, కెసిఆర్, చంద్రబాబుపై మండిపడ్డారు.

తెలంగాణపై తీర్మానం

తెలంగాణపై కాంగ్రెసు పార్టీ తీర్మానాన్ని మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రవేశ పెట్టారు. సోనియా పైన ఈ సభ పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తోందని, సత్వరమే తెలంగాణను ఏర్పాటు చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నామని, లేదంటే పార్టీ మనుగడే కష్టమని, జాప్యం జరిగితే ఇబ్బంది తప్పదని తీర్మానం చేశారు.

Telangana

గుండె చప్పుడు: శ్రీధర్ బాబు

తెలంగాణ సాధన కోసం కాంగ్రెసు పార్టీ అరవై ఏళ్లుగా పోరాడుతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ మనందరి గుండె చప్పుడు అన్నారు. 1969 నుండి తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెసు కీలకంగా ఉందన్నారు. తెలంగాణ పేరుతో కొంతమంది వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. జై తెలంగాణ, జై కాంగ్రెస్ తమ నినాదమని చెప్పారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెసుతోనే తెలంగాణ సాధ్యమని, అందుకే ఓపిగ్గా ఉన్నామన్నారు. రాష్ట్రాన్ని సాధిస్తామన్న నమ్మకముందన్నారు.

అడ్డుకుంటుంది నాయకులే: విహెచ్

తెలంగాణను అడ్డుకుంటున్నది నాయకులేనని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు అన్నారు. అన్నదమ్ముల్లా విడిపోదామని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇస్తే పదిహేను పార్లమెంటు స్థానాలలో గెలుస్తామన్నారు. తెలంగాణ పేరుతో కొన్ని ప్రాంతీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ రాదన్నారు. మెజార్టీ ఉన్న వారి మాటే అధిష్టానం వింటుందన్నారు. విభజనకు సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నా, కొందరు నాయకులే అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

హైదరాబాదుతో కూడిన రాష్ట్రం: అంజన్

తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెసు పార్టీయేనని సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణ కావాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలు తెలంగాణను కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ కోసం అందరికంటే ఎక్కువగా పోరాడుతున్నది అధికార పార్టీ ఎంపీలే అన్నారు. అమావాస్యకు, పున్నమికి సభకు వచ్చే కెసిఆర్ తెలంగాణ ఎలా సాధిస్తారని ప్రశ్నించారు.

ఢిల్లీకి వినిపించాలి: జానా

తెలంగాణ నినాదం ఢిల్లీలో మార్మోగాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెసుతోనే సాధ్యమన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెసు నేతలం అందరం ముందుండి పోరాటం చేస్తామని చెప్పారు.

సంతోషంగా ఉంది: డిఎస్

సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని మాజీ పిసిసి అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెసు నేతల మధ్య ఉన్న ఐక్యత చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. పార్టీకి చెందిన ఎంపీలు వారు ఇబ్బందిపడుతూ, అధిష్టానాన్ని ఇబ్బందిపెడుతూ లోకసభను అడ్డుకున్నారన్నారు. శాసన సభ్యులు కూడా రాష్ట్రం కోసం సభలో తెలంగాణ నినాదాలు చేస్తూ బయటకు వచ్చారన్నారు.

కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఆకు మీద ముల్లు పడ్డా, ముల్లు మీద ఆకు పడ్డా.. ఆకుకే నష్టం అన్న చందంగా ఉందన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెసు పార్టీని బలపరుస్తూనే తెలంగాణ సాధిస్తామన్నారు. కాంగ్రెసుతోనే తెలంగాణ సాధ్యమని ప్రజలకు తెలుసునని చెప్పారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమో కాంగ్రెసు పార్టీ బలోపేతం అంతే ముఖ్యమన్నారు. తాము రెండు రాష్ట్రాలు అంటున్నామే తప్ప ప్రజలు విడిపోవాలనడం లేదన్నారు.

తమ తెలంగాణ ఆకాంక్ష తప్పకుండా నెరవేరుతుందని డిఎస్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సాధించుకుంటామనే పూర్తి విశ్వాసం తమకుందన్నారు. తెలంగాణకు మరెంతో కాలం పట్టదన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్న భావన అధిష్టానంలో ఉందన్నారు. అన్నదమ్ముల్లా విడిపోయి రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటు అనివార్యమన్నారు.

టిడిపి, వైయస్సార్ కాంగ్రెసుపై మండిపాటు

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణ వ్యతిరేక పార్టీలని మరో నేత ఆరోపించారు. వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడేనని మండిపడ్డారు. టిడిపిని తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టలన్నారు. పార్లమెంటులోనే వైయస్ జగన్ సమైక్య ప్లకార్డు పట్టుకున్నారని, ఇప్పుడు విజయమ్మ, షర్మిలలు తెలంగాణ ప్రాంతంలో పర్యటించడం విడ్డూరమన్నారు. కాంగ్రెసు ద్వారానే తెలంగాణ సాధ్యమన్నారు.

ఆకాంక్షను తెలిపేందుకే: డికె అరుణ

తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఢిల్లీ పెద్దలకు తెలియజేసేందుకే ఈ సభను ఏర్పాటు చేశామని మంత్రి డికె అరుణ అన్నారు. తెలంగాణ సాధన కాంగ్రెసు ద్వారానే సాధ్యమన్నారు. తెలంగాణను ఏర్పాటు చేయాలని సోనియా గాంధీని కోరుతున్నామని చెప్పారు. తెలంగాణ సాధనే మన ఏకైక లక్ష్యమని వనమా అన్నారు.

కాంగ్రెసుకే శక్తి ఉంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ ఇచ్చే శక్తి కేవలం కాంగ్రెసుకు మాత్రమే ఉందని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ పైన నమ్మకముందన్నారు. 2014 ఎన్నికల్లో యూపిఏనే గెలుస్తుందని, రాబోయే ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, కాంగ్రెసు పార్టీ బతికి బట్ట కట్టాలంటే రాష్ట్రం ఇవ్వాల్సిందే అన్నారు. తెలంగాణ ప్రాంత నేతకు ముఖ్యమంత్రి పదవి వస్తే కుట్రలతో దించివేశారని మండిపడ్డారు.

జై కాంగ్రెసు.. జై తెలంగాణ: పొన్నం

కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం పూర్తిగా ఉందని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఢిల్లీ పెద్దలకు చెప్పేందుకే ఈ సభను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణపై అధిష్టానం సానుకూలంగా స్పందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ కోసం పోరాడటం తెలంగాణ పౌరుడిగా తమ హక్కు అన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే ఏం చేస్తారని కొందరు తమను ప్రశ్నిస్తున్నారని, అదే అయితే వారు ఎలాంటి కార్యాచరణ తీసుకున్నా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ కోసం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తెలంగాణపై సోనియా మాట తప్పరన్న నమ్మకం ఉందని మంత్రి గీతా రెడ్డి అన్నారు.

తెలంగాణ తీసుకు రాకుంటే..: రాపోలు

ఈ పరిస్థితుల్లో కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని ఎంపి రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజల రణన్నినాదం తెలంగాణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప ప్రత్యామ్నాయం లేదన్నారు. ఈ సభతో ఢిల్లీకి సంకేతాలు అందాయన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఇస్తుందన్న నమ్మకముందని షబ్బీర్ అలీ అన్నారు.

ఇచ్చేవాళ్లనొదిలి..: పొన్నాల

తెలంగాణను ఇచ్చే వాళ్లనొదిలి సచ్చేవాళ్లతో ఎవరూ కలవరని ఈ సభతో తేటతెల్లమైందని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

సాధిస్తాం: సునీత

తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సాధించి తీరుతామని మంత్రి సునితా లక్ష్మా రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ ఆమోదిస్తారన్నారు.

ఒత్తిడి తెచ్చి రాష్ట్రం తెస్తాం: కోమటిరెడ్డి వెంకట రెడ్డి

సోనియాపై ఒత్తిడి తెచ్చి తాము తెలంగాణను సాధిస్తామని కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. ఆత్మహత్యలు తనను కలిచివేశాయన్నారు. తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వెంకట రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని అధిష్టానం ఇస్తుందని, ఒకవేళ సీమాంధ్ర నేతలు లాబీయింగ్ చేసి అడ్డుకుంటే రాజీనామాలు చేసైనా తెలంగాణ సాధిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+