మోడీ, రాహుల్ గాంధీ రాంబో, డంబో ఇలా (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఇటీవలి ఉత్తరాఖండ్ వరదల విషయంలో పరస్పర విమర్శలు చేసుకోవడంలో కాంగ్రెసు, బిజెపి నాయకులు పూర్తిగా పరిమితులు దాటిపోయారని అనిపిస్తోంది. నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ పోరాటాన్ని కాంగ్రెసు, బిజెపి నాయకులు రాంబో, డంబోల వైరంగా మార్చేశారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెసు నాయకులు పదే పదే విమర్శించడాన్ని ప్రస్తావిస్తూ బిజెపి నేత మీనాక్షి లేఖి సోమవారంనాడు - డంబో లేదా స్కామ్‌బో కన్నా రాంబో కావడం మంచిదని వ్యాఖ్యానించారు. గుజరాత్ బాధితులను 15 వేల మందిని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ నుంచి తరలించడాన్ని వ్యాఖ్యానించడానికి మోడీని రాంబోగా అభివర్ణించారు.
ఉత్తరాఖండ్ వరదలపై రాహుల్ గాంధీ ప్రతిస్పందించడానికి సమయం తీసుకున్నారు. దీంతో ఆయన డంబోగా బిజెపి నాయకులు అభివర్ణిస్తున్నారు. లేఖి మరో మాటను ముందుకు తెచ్చారు. అది స్కామ్‌బో. అంటే యుపిఎ ప్రభుత్వం స్కామ్‌ల వలయంలో చిక్కుకుందని చెప్పడానికి ఆ మాటను వాడారు.

ఉత్తరాఖండ్‌లోని వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ డెహ్రడూన్ విమానాశ్రయంలో..

అమేథీలో జరిిన భారత వైమానిక దళాల జెడబ్ల్యూఓ అఖిలేష్ కుమార్ సింగ్ అంత్యక్రియలకు హాజరైన రాహుల్ గాంధీ. గౌరికుండ్‌లో హెలికాప్టర్ కూలిన ఘటనలో అఖిలేష్ కుమార్ మరణించారు.

అఖిలేష్ కుమార్ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న రాహుల్ గాంధీ..

ఉత్తరాఖండ్ వరద తాకిడి ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణతో డెహ్రడూన్‌లో మాట్లాడుతున్న నరేంద్ర మోడీ

ఉత్తరాఖండ్ వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించిన రాహుల్ గాంధీ
ఉత్తరాఖండ్ వరదల నుంచి రాజకీయ లబ్ధి పొందడానికి బిజెపి మొదట రంగంలోకి దిగిందని, 15 వేల మంది గుజరాతీలను తరలించడం ద్వారా ఆ క్రెడిట్ కొట్టేయాలని చూసిందని కాంగ్రెసు కమ్యూనికేషన్ల మంత్రి అజయ్ మాకెన్ మోడీపై వ్యాఖ్యానించారు. రాజకీయాలు చేయడాన్ని, ఫొటోలు తీయించుకోవడాన్ని పక్కన పెట్టి ఉత్తరాఖండ్ పాలనాయంత్రాంగం తన పనిచేసుకునేలా మోడీ చూడాల్సిందని కాంగ్రెసు నాయకుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ యంత్రాంగం, సైనిక బలగాలు బాధితులను తరలించారని, ఆ క్రెడిట్‌ను మోడీ కొట్టేయాలని చూస్తున్నారని ఆయన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. మోడీ ఉత్తరాఖండ్ పర్యటనను రాంబో చర్యగా అభవర్ణిస్తూ తీవ్రమైన విపత్తు నుంచి రాజకీయ ప్రయోజనాలు పొందడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని, సమస్యను రాజకీయం చేయాలని చూస్తున్నారని కాంగ్రెసు నాయకులు విమర్శించారు.
మోడీ తర్వాత రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లారు. ఉత్తరాఖండ్ విపత్తు సంభవించిన వెంటనే ప్రతిస్పందించకపోవడంపై ప్రతిపక్షాలు రాహుల్ గాంధీపై విమర్శలు చేశాయి. విఐపిలు ఉత్తరాఖండ్ పర్యటనలు చేయవద్దని, విఐపిల పర్యటనల వల్ల సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు.












Click it and Unblock the Notifications