ఢిల్లీ: వాస్తవాలు చెప్తానన్న బొత్స, నాకు తెలుసన్న డిగ్గీ

ఢిల్లీకి షిప్ట్
తెలంగాణపై ప్రకటన రానున్న నేపథ్యంలో సీమాంధ్ర, తెలంగాణ నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. ఇప్పటికే పలువురు నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పలువురు ఈ రోజు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు ఇంట్లో భేటీ అయ్యారు. కెవిపి, లగడపాటి రాజగోపాల్, కనుమూరి బాపిరాజు, శైలజానాథ్, టిజి వెంకటేష్, కొండ్రు మురళి, గాదె వెంకటరెడ్డి తదితరులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.
ప్రశ్నించాలి: టిజి వెంకటేష్
సీమాంధ్ర ప్రజలు మౌనంగా ఉంటే అది అర్ధాంగీకారమే అవుతుందని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. ఇరు ప్రాంతాల అభిప్రాయాలను కోర్ కమిటీ పరిశీలిస్తుందన్నారు. ఆ తర్వాతనే నిర్ణయముంటుందన్నారు. సీమాంధ్రులు ప్రశ్నిస్తేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందన్నారు. తాజా పరిస్థితులపై తాము చర్చించామని, విపత్కర పరిస్థితుల్లో ఏ వ్యూహాన్ని అనుసరించాలో చర్చించామన్నారు.
అంతా తెలుసు: దిగ్విజయ్
సీమాంధ్ర నేతలు దిగ్విజయ్ సింగ్‌ను కలుసుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరారు. దీనికి డిగ్గీ మాట్లాడుతూ.. ఎపి పరిస్థితిపై తనకు పూర్తిగా తెలుసునని, తనకు ఇచ్చిన నివేదికను కోర్ కమిటీ సభ్యులకు అందరికీ ఇవ్వాలని సూచించారు. కోర్ కమిటీ భేటీ తర్వాత తెలంగాణపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. చిన్న రాష్ట్రాల వల్ల అనర్థాలు ఉంటాయని దిగ్విజయ్‌కు వివరించామని శైలజానాథ్ అన్నారు.
తెలంగాణ తప్ప: డికె అరుణ
తెలంగాణ నేతలు కూడా ఢిల్లీలో ఉన్నారు. తాజాగా తెలంగాణ మహిళా మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గీతా రెడ్డి, డికె అరుణలు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఢిల్లీ బయలుదేరారు. అదే విమానంలో ఉండవల్లి బయలుదేరారు. హైదరాబాదు రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని, మరో ప్రత్యామ్నాయానికి అంగీకరించేంది లేదని డికె అరుణ ఈ సందర్భంగా చెప్పారు.
రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన వస్తుందని, విభజనకు అందరూ సహకరించాలని నల్గొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విషయంలో అధిష్టానానిదే ఫైనల్ అని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. తెలంగాణ మోనాలిసా చిత్రం వంటిదన్నారు. మోనాలిసా చిత్రాన్ని ఎటు చూసినా తమ వైపు చూస్తున్నట్లుగా ఉంటుందని, తెలంగాణ అంశం కూడా ఎవరి వైపు నుంచి చూస్తే వారికి అనుకూలంగా కనిపిస్తుందన్నారు.
బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ ఇంటిని సమైక్యాంధ్ర జెఏసి ముట్టడించింది. రాజీనామా చేయాలని పట్టుబట్టడంతో ఆమె రాజీనామాను వారికి అందించారు.












Click it and Unblock the Notifications