తెలంగాణపై టెన్షన్: మిగిలింది ఒక్క రోజే, తేలుతుందా?

ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండడంతో దేశరాజధాని ఢిల్లీలో, రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌ను నేతలు కలుస్తున్నారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర నేతలతో సంప్రదింపులు ముమ్మరం చేశారు.
రోడ్‌మ్యాప్‌లతో కిరణ్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ గురువారం ఢిల్లీ విమానం ఎక్కనున్నారు. శుక్రవారం నాటి కోర్‌కమిటీ భేటీలో తెలంగాణపై కీలకచర్చలు జరగనున్నాయి. కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశానికి ముందే దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు నేతలతో చర్చించి, వారి రోడ్‌మ్యాప్‌లను తీసుకుంటారని సమాచారం. రాష్ట్ర నేతల అభిప్రాయాలను కోర్‌కమిటీకి వివరిస్తారు. రాష్ట్రంలో పర్యటించిన తర్వాత దిగ్విజయ్ ఇప్పటికే ఒక నివేదికను సోనియాకు సమర్పించారు.
తెలంగాణపై ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, ప్రస్తుత పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కోర్ కమిటీ భేటీలో వివరిస్తారు. ఆయనకు సహకరించేందుకు వీలుగా హోంశాఖ ఉన్నతాధికారులనూ ఈ భేటీకి ఆహ్వానించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి చిదంబరం మినహా కోర్ కమిటీ సభ్యులంతా ఈ సమావేశానికి హాజరవుతారని చెబుతున్నారు. రాహుల్ గాంధీ కూడా సమావేశానికి హాజరు కానున్నారు. సమావేశంలో ఎవరు ఏం చెప్పినా తుది నిర్ణయం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలదే అవుతుంది. అయితే, ఆగస్టు 15వ తేదీ లోపు తెలంగాణపై కచ్చితమైన ప్రకటన వెలువరించడానికి వీలుగా తల్లీకొడుకులు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications