నేనలా అనలేదు, అర్థం కావట్లేదు: రాజీనామాపై కిరణ్

క్రమశిక్షణ కలిగిన కాంగ్రెసు కార్యకర్తగా తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇలాంటి ప్రచారాలు ఎందుకు వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని ఆయన చెప్పారు.
కాగా తెలంగాణ ఇస్తే తనతో సహా సీమాంధ్ర నేతలమంతా రాజీనామా చేస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. సోనియాతో ఐదు, పది నిమిషాలు భేటీ అయిన కిరణ్ విభజిస్తే కాంగ్రెసు లాభపడదని, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే అందరూ రాజీనామా చేస్తారని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. సోనియా కూడా అందుకు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆదేశించారట.
అవాస్తవం: పొంగులేటి
తెలంగాణ ఇస్తే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తానని చెప్పినట్లు వచ్చిన వార్తలను పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖండించారు.
బెదిరింపులకు లొంగదు
తెలంగాణ ఇస్తే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తానని హెచ్చరించినట్లుగా వార్తలు వస్తున్నాయని, అదే నిజమైతే అలాంటి బెదిరింపులకు అధిష్టానం భయపడదని పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే చేస్కోనివ్వండని మధుయాష్కీ ఘాటుగా స్పందించారు. తెలంగాణకు కిరణ్ అడ్డుపడుతున్నారని ఓయు విద్యార్థులు ఆందోళనకు దిగారు.
కోర్ కమిటీ భేటీ ముందుకు
మరోవైపు ఈ రోజు ఐదు గంటలకు జరగాల్సిన కోర్ కమిటీ భేటీ గంట ముందుకు జరిగింది. నాలుగు గంటలకే కోర్ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీకి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్‌లను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచారు.












Click it and Unblock the Notifications