తెలంగాణ ఇస్తామంటే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం వస్తే కిరణ్ కుమార్ రెడ్డితో పాటు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 175 మంది శాసనసభ్యుల్లో 170 మంది సభ్యులు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఢిల్లీలో మకాం వేసివున్న సీమాంధ్రకు చెందిన అగ్రనేత ఒకరు మీడియాకు చెప్పారు. కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యులతో పాటు తెలుగుదేశం శాసనసభ్యులు కూడా రాజీనామాకు ముందుకు రావచ్చునని అంటున్నారు.
తెలంగాణపై ఎలాంటి నిర్ణయం వెలువడకుండా అడ్డుకోవాల్సిన బాధ్యతను సీమాంధ్ర నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పెట్టనట్లు సమాచారం. దీన్ని కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్నారు. తనను తాను నాయకుడిగా నిరూపించుకునేందుకు ఇదో మంచి అవకాశమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.
అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టలేనని, తెలంగాణకు ప్యాకేజీకి, స్వయం ప్రతిపత్తి కూడిన మండలికి మాత్రం సిద్ధమని కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కోర్ కమిటీలో చెప్పనున్నట్టు తెలుస్తోంది. అయినా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే అధిష్టానం పట్టుబడితే రాజీనామా చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నట్లు సమాచారం. రాజీనామాల ద్వారా రాజకీయ సంక్షోభం సృష్టించాలని సీమాంధ్ర శానససభ్యులు భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications