సిడబ్ల్యుసిపై భారం: తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేస్తారా?

న్యూఢిల్లీ: తెలంగాణ బంతిని కాంగ్రెసు కోర్ కమిటీ పార్టీ అత్యున్నత స్థాయి నిర్ణాయక విభాగం వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) కోర్టులోకి నెట్టింది. సిడబ్ల్యుసి సమావేశం ఎప్పుడు జరుగుతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆ సమావేశం ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పడం లేదు. కానీ తెలంగాణపై ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే, ఈ నెలాఖరులోగా ఎప్పుడైనా సిడబ్ల్యుసి సమావేశం జరగవచ్చునని అర్థం చేసుకోవచ్చు.

2009, డిశెంబరు 9నాడు ప్రకటన చేసి చేతులు కాల్చుకున్న కాంగ్రెసు పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దాంతో పద్ధతి ప్రకారం తెలంగాణ అంశాన్ని తేల్చేందుకు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే సమస్యను వర్కింగ్ కమిటీకి నివేదించాలని నిర్ణయించినట్లు చెప్పవచ్చు. సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వపరంగా తెలంగాణపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.

తెలంగాణపై సిడబ్ల్యుసిలో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అంగీకారం తెలుపుతూ సోనియా గాంధీ నేతృత్వంలోని సిడబ్ల్యుసి 2001లో నిర్ణయం తీసుకుంది. అందుకు రెండో ఎస్సార్సీ శరణ్యమని తెలిపింది. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కాంగ్రెసు పొత్తు పెట్టుకుంది.

Telangana

తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేస్తామని కాంగ్రెసు తెరాసకు హామీ ఇస్తూ ఒప్పంద పత్రం రాసుకుంది. అయితే, వాటి జోలికి వెళ్లకుండా తెలంగాణ అంశాన్ని యుపిఎ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో, రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చింది. తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఆమరణ దీక్ష నేపథ్యంలో డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించారు. దాంతో సమస్య మరింత జఠిలమైంది.

తెలంగాణ ఇస్తే, మిగతా రాష్ట్రాల్లో కొత్త రాష్ట్రాల డిమాండ్లు ఉవ్వెత్తున లేచే ప్రమాదం ఉందని కాంగ్రెసు అధిష్టానం ఆందోళన చెందుతోంది. సిడబ్ల్యుసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. శనివారం కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి నివాసంలో సమావేశమైన తెలంగాణ మంత్రులు సుదర్శన్ రెడ్డి, సారయ్య తదితరులు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే, తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేస్తుందని సీమాంధ్ర నాయకులు అభిప్రాయపడుతున్నారు. రెండో ఎస్సార్సీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా అంగీకారం తెలిపినట్లు చెబుతున్నారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేస్తారని శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా అన్నారు.

మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నాయకులు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నారు. తమిళనాడు, కర్నాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇటీవలి కాలంలో అక్కడక్కడ చిన్న రాష్ట్రాల డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ స్థితిలో తెలంగాణ ఏర్పాటు చేస్తే ఆ డిమాండ్లతో ఉద్యమాలు పెచ్చరిల్లుతాయని అంటున్నారు. ఈ స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం అంత సులభపం కాదనే మాట వినిపిస్తోంది. అయితే, మధ్యేమార్గం గురించి కాంగ్రెసు అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ విషయంలో ప్యాకేజీలు, పాలక మండళ్ల వంటివి పనికి రావని, కొత్త హామీల వల్ల కూడా ప్రయోజనం లేదని, రెండో ఎస్సార్సీ వేసినా ఫలితం ఉండదని కాంగ్రెసు అధిష్టానం భపావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో అటువంటి చర్యలు పార్టీకి ఏ విధమైన ప్రయోజనం చేకూర్చి పెట్టవనే విషయం కూడా పార్టీ అధిష్టానం అవగాహనలోకి వచ్చిందని అంటున్నారు. అలాంటి చర్యలు తీసుకోవడానికి బదులు తెలంగాణ అంశాన్ని నాన్చడమే మంచిదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం చేస్తూ, మిగతా డిమాండ్లపై రెండో ఎస్సార్పీ వేయాలని కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు. రాయలసీమ వంటి కొత్త డిమాండ్లను కూడా రెండో ఎస్సార్సీ అధ్యయనం చేస్తుందనే హామీని ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మాత్రం విభజన వైపే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+