తెలంగాణ తేల్చకపోవచ్చు: సంజీవ రెడ్డి సంచలనం

సంజీవ రెడ్డి అదిలాబాద్ జిల్లాకు చెందిన వారు. సిడబ్ల్యూసిలో రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక వ్యక్తి. అలాంటి సంజీవ రెడ్డి తెలంగాణ కష్టమేననే తరహాలో మాట్లాడారు. తెలంగాణ ఇవ్వాలనుకుంటే దేశంపై పడే ప్రభావాన్ని చూడాలన్నారు. తానేతే ప్యాకేజీనే ఇవ్వాలని కోరుతానన్నారు. ఏ రకంగా చూసిన తెలంగాణ ఇచ్చే ఉద్దేశ్యం కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఇవ్వాలన్న స్పష్టత ఉంటే కోర్ కమిటీలోనే నిర్ణయం తీసుకునే వారని, సిడబ్ల్యూసికి రిఫర్ చేసినా అక్కడ నిర్ణయానికి అవకాశాలు తక్కువ అన్నారు.
సిడబ్ల్యూసిలో రాష్ట్రానికి ఓ సభ్యుడు చొప్పున దాదాపు 22 మంది సభ్యులున్నారని, వీరు కాక శాశ్వత ఆహ్వానితులు.. ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారని, వీరంతా ఏకాభిప్రాయానికి రావడం కుదరదని, ఆమోదయోగ్యమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చివరిగా అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని, తనకు తెలిసినంత వరకు తెలంగాణ ఇచ్చే ఉద్దేశం అధిష్ఠానం దృష్టిలో లేదన్నారు.
ప్యాకేజీ ఇచ్చేందుకే మొగ్గు చూపిస్తోందన్నారు. ఈ దిశగా ఇరు ప్రాంతాల వారిని కూర్చోబెట్టి ఓ రాజీ ఫార్ములాను ప్రకటించనుందన్నారు. తెలంగాణ వెనకబడిందని, దాని అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని పైనే అధిష్ఠానం దృష్టి పెట్టిందన్నారు. తెలంగాణకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం కుదిరే పని కాదన్నారు. ఇందుకు రాజ్యాంగాన్ని సవరించడం కష్టమని స్పష్టం చేశారు.
తెలంగాణ ఇస్తే ఇతర రాష్ట్రాల్లో విభజన వాదం వినిపిస్తుందని, వాటికి సమాధానం చెప్పడం కాంగ్రెసు పార్టీకి కష్టమన్నారు. రెండు ప్రాంతాల వారు రాజీపడి ఒ నిర్ణయానికి రావాలన్నారు. రెండో ఎస్సార్సీ అంశం ఇప్పుడు సిడబ్ల్యూసిలో రాకపోవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications