కిరణ్ రెడ్డి తెలంగాణ చిచ్చు: దండెత్తిన 'టీ' నేతలు
హైదరాబాద్: తెలంగాణపై జరిగిన కాంగ్రెసు కోర్ గ్రూప్ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన విషయాలు వెల్లడవుతుండడంపై పార్టీలో కలకలం రేపుతున్నాయి. తెలంగాణ ఇస్తే నక్సలైట్లు పెరుగుతారని కిరణ్ కుమార్ రెడ్డి చేసినట్లు వచ్చిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. అలాగే, బిజెపి, మజ్లీస్ వంటి మత పార్టీల బలం పెరుగుతుందని ఆయన చెప్పినట్లు వచ్చిన వార్తలపై కూడా చర్చ సాగుతోంది. మతతత్వ పార్టీల బలం పెరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పినట్లు వచ్చిన వార్తల గురించి తెలుసుకోవడానికి మజ్లీస్ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, ఇతర శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు.
నక్సలైట్ సమస్య పెరిగి తెలంగాణ చత్తీస్‌గడ్, జార్ఖండ్ మాదిరిగా అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు వచ్చిన వార్తలపై తెలంగాణ కాంగ్రెసు నేతలు ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. నక్సలిజం పుట్టిందే శ్రీకాకుళం జిల్లాలో అని, అది శ్రీకాకుళం నుంచి విజయనగరం, విశాఖపట్నం, ఖమ్మం జిల్లాల మీదుగా వరంగల్ జిల్లాకు పాకిందని ఆయన అన్నారు. 1969లో తెలంగాణ ఇవ్వకపోవడం వల్లనే నక్సలిజం పెరిగిందనే వాదన తెలంగాణ కాంగ్రెసు నేతల నుంచి ముందుకు వస్తోంది.

తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి చేసిన సూచనపై కూడా పెద్ద యెత్తున చర్చ సాగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి కోర్ గ్రూపులో సమర్పించిన రోడ్ మ్యాప్‌నకు సంబంధించిన వివరాలు పద్ధతి ప్రకారం మీడియాకు లీక్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్యాకేజీల ప్రతిపాదనను తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ఇస్తే పార్టీకి ప్రయోజనం చేకూరుతుందనే వాదనలో నిజం లేదని ఆయన చెప్పినట్లు వచ్చిన వార్తలపై కూడా తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం, ఉగ్రవాదం పెరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం ధ్వజమెత్తారు. కిరణ్ సీఎంలా కాకుండా సీమాంధ్రనేతలా వ్యవహరిస్తున్నారని మందా మండిపడ్డారు. నక్సలిజం పుట్టిందే సీమాంధ్రలోనని మందా అన్నారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో ముఖ్యమంత్రిగా కిరణ్ విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని మందా డిమాండ్ చేశారు.
చిన్న రాష్ట్రాల వల్ల నక్సల్స్ సమస్య వస్తుందనుకోవడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరణారెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గండ్ర వెంకటరమణా రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నక్సల్స్ అంశాన్ని చిన్న రాష్ట్రాలకు ఆపాదించడం సరికాదని, నక్సల్స్ సమస్యను సామాజిక కోణంలో చూడాలని ఆయన సూచించారు. చిన్న రాష్ట్రమైన కేరళలో నక్సల్స్ సమస్య ఉందా అని గండ్ర ప్రశ్నించారు.
తెలంగాణ ఇస్తే నక్సలైట్ల సమస్య పెరుగుతుందనే వాదనను నిజామాబాద్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ కూడా ఖండించారు. రాష్ట్ర విభజన జరుగుతుందని, ప్యాకేజీ తెలంగాణకు తాత్కాలిక ఉపశమనం కలుగుతుందే తప్ప సమస్య పరిష్కారం కాదని మదుయాష్కి అన్నారు. రాష్ట్ర ఏర్పాటు జరిగితే నక్సలిజం పెరగదని, రాష్ట్ర విభజన జరగకపోతేనే నక్సలిజం పెరుగుతుందని ఆయన తెలిపారు. మొత్తం మీద, కిరణ్ కుమార్ రెడ్డి కోర్ గ్రూప్ సమావేశంలో చెప్పినట్లు వస్తున్న వార్తాకథనాలు కాంగ్రెసులో చిచ్చు పెట్టాయి.
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండదు
కోర్ గ్రూప్ సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పిన విషయాలను వెల్లడించడానికి వీలు కాదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజనపై నిర్ణయం జరుగుతుందని రాష్ట్ర వ్యవహారాల ఆయన అన్నారు. హైదరాబాద్‌లో అనేక ప్రాంతాలవారు ఉన్నారని, అందువల్ల ఉమ్మడి రాజధానిగా ఉండకపోవచ్చునని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై ఇరు ప్రాంతాలకు చెందిన నేతల వాదనలు బలంగా ఉన్నాయని దిగ్విజయ్ అన్నారు.












Click it and Unblock the Notifications