
సీమాంధ్రలో జగన్, బాబు: తెలంగాణలో వీరు (ఫొటోలు)
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే ఏ పార్టీ పరిస్థితి ఏమిటనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఇస్తే తెలంగాణలోని 17 లోకసభ స్థానాల్లో 15 సీట్లు సాధించిపెడతామని ఈ ప్రాంత కాంగ్రెసు నాయకులు పార్టీ అధిష్టానానికి హామీ ఇస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో 42 లోకసభ స్థానాలున్నాయి. వీటిలో అత్యధిక స్థానాలు పొందితేనే కాంగ్రెసు ఢిల్లీలో అధికార పీఠాన్ని అధిష్టించడానికి మార్గం సుగమమవుతుంది.
రాష్ట్ర విభజన చేస్తే తమకు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ స్థానాలు వస్తాయని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ కూడా చెప్పారు. అందుకు అనుగుణంగానే కాంగ్రెసు అధిష్టానం రాష్ట్ర విభజనకు మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అయితే, రాయల తెలంగాణ ప్రతిపాదన అనేది ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. కానీ అలాంటి పరిస్థితి తలెత్తకపోవచ్చునని అంటున్నారు.

రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ తీవ్రంగా నష్టపోవచ్చునని అంచనా వేస్తున్నారు. అయితే, చిరంజీవి, కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, కావూరి సాంబశివరావు వంటి సమైక్యవాదులు సీమాంధ్రలో నష్టం జరగకుండా అడ్డుకుంటారనే అంచనాలు కూడా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే కాంగ్రెసు, తెరాసలు మాత్రమే తెలంగాణలో మనుగడ సాగిస్తాయని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కాంగ్రెసులో విలీనం కావచ్చునని కూడా అంటున్నారు. విభజన జరిగిన తర్వాత తెరాసకు ఏ విధమైన నినాదం ఉండదు కాబట్టి కాంగ్రెసు లాభపడవచ్చునని అంటున్నారు. తెరాస తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ నినాదాన్ని ఇప్పటికే అందుకుంది. అది ఏ మాత్రం ఉపయోగపడుతుందో చెప్పలేం.

రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని భావిస్తున్నారు. సీమాంధ్రలో మాత్రం బలం పుంజుకుంటుందని అంచనాలు వేస్తున్నారు. సీమాంధ్రలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని అంటున్నారు.

జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటికే తెలంగాణలో బలహీనంగా ఉంది. విభజన జరిగితే తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి స్థానం ఉండదని భావిస్తున్నారు. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీతో పోరాడాల్సి వస్తుందని చెబుతున్నారు.

జగన్ కారణంగా సీమాంధ్రలో, రాష్ట్ర ఏర్పాడు డిమాండ్ కారణంగా తెలంగాణలో - మొత్తంగా రెండు ప్రాంతాల్లోనూ తుడిచిపెట్టుకుపోవడానికి బదులు తెలంగాణలోనైనా అత్యధిక సీట్లు సాధించుకోవడానికి విభజన తప్పదనే భావనతో సోనియా గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ ప్రజలను మోసం చేసిందంటూ బిజెపి ఎత్తుకున్న నినాదం కాంగ్రెసు అదిష్టానానికి మింగుడు పడడం లేదని అంటున్నారు. దానికి తోడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చరిష్మా తోడైతే తెలంగాణలో తమకు కష్టాలు తప్పవని కాంగ్రెసు అధిష్టానం భావించినట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో బిజెపిని ఆదిలోనే అడ్డుకోవడానికి విభజన మంత్రం తప్పదని సోనియా గాంధీ బావించినట్లు సమాచారం.
రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో కాంగ్రెసుకు, తెలంగాణ ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలకు ఎదురు దెబ్బ తగులుతుందని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెసుతో పాటు కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా బలంగానే ఉంటుందని చెబుతున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెరాస కాంగ్రెసులో విలీనం కావచ్చుననే ఊహాగానాలకు బలం చేకూరుతోంది. దాంతో తెలంగాణలో తెలుగుదేశం, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోతాయని అంచనా వేస్తున్నారు.
విభజనకు కాంగ్రెసును వేలెత్తి చూపుతూ తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు సీమాంధ్రలో ప్రచారం సాగించి, ప్రయోజనం పొందవచ్చునని అంటున్నారు. దాంతో ఆ ప్రాంతంలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని అంచనాలు సాగిస్తున్నారు. కానీ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తీవ్రంగా ప్రయత్నించామని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు.
దానికితోడు, చిరంజీవి కూడా సమైక్యవాది కావడం కాంగ్రెసుకు కలిసి రావచ్చునని అంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెసుకు ఉన్న కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధేశ్వరి, చిరంజీవి, కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి నాయకులు ఏదో మేరకు బలం చేకూర్చి పెడుతారనే అంచనాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సమీకరణాలు ఒక కుదుపునకు గురవుతాయని చెప్పడంలో సందేహం లేదు.