మిడ్డే మీల్ ట్రాజెడీ: ప్రిన్సిపాల్ పరారీ, మంత్రిపై దాడి
పాట్నా: బీహార్‌లోని శరన్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోని విషాహారం విషాద ఘటనకు సంబంధించి పాఠశాల ప్రిన్సిపాల్ పరారైంది. పాఠశాలలో విషాహారం తిన్న పిల్లల్లో 23 మంది మరణించిన విషయం తెలిసిందే. పిల్లలకు ఉచితంగా అందించే మధ్యాహ్న భోజనం ప్రామాణికమా, కాదా అనేది తనిఖీ చేసిన దాఖలాలు లేవని అంటున్నారు.
పాఠశాల ప్రిన్సిపాల్ మీనా దేవి భర్తతో పాటు కనిపించకుండా పోయింది. ఆమెను పట్టుకోవడానికి గాలింపు చేపట్టినట్లు శరన్ జిల్లా మెజిస్ట్రేట్ అభిజిత్ సిన్హా చెప్పారు. మధ్యాహ్న భోజనం వండడానికి వాడిన సరుకులను మీనాదేవి భర్త దుకాణంలోనే కొన్నట్లు తెలుస్తోంది. ప్రిన్సిపాల్‌పై కేసు నమోదైంది. ఆమెను ఉద్యోగం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

విషాహారం తిని అస్వస్థతకు గురైన 24 మంది పిల్లలతో పాటు వంట మనిషి మంజు దేవి పాట్నా వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏ విధమైన అరెస్టులు జరగలేదు. ధర్మసతి గండవన్ గ్రామం వద్ద గల పాఠశాల వెలుపల పిల్లల మృతదేహాలను సమాధి చేశారు.
ఆహారం కలుషితం కావడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని బీహార్ ప్రిన్సిపల్ కార్యదర్శి అమర్‌దీప్ సిన్హా చెప్పారు. శుక్రవారంనాడు ఫొరెన్సిక్ నివేదిక వస్తుందని చెప్పారు. ఆహారంలో వరి, గోధుమ పంటలకు వాడే క్రిమిసంహారక మందు ఆర్గానోఫాస్పేట్ ఉందని విద్యాశాఖ మంత్రి పికె సాహీ చెప్పారు. నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేయడానికి కుట్ర జరిగి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
మిడ్డే మీల్ ప్రమాదానికి నిరసనగా బీహార్ మంత్రి పర్వీన్ అమానుల్లాపై నిరసనకారులు దాడి చేశారు వైశాలి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పాట్నా నుంచి ముజఫర్‌పూర్‌కు వెళ్తుండగా ఓ గుంపు ఆమెను అడ్డుకుంది. హజీపూర్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆమె కారుపై రాళ్లు రువ్వారు, ఆమెను ఆపేశారు. దీంతో తాను కార్యక్రమాన్ని రద్దు చేసుకుని పాట్నాకు తిరిగి వెళ్లినట్లు మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications