తెలంగాణ: ఈ నెల 28న సిడబ్ల్యుసి ముహూర్తం

ఈ సమావేశంలో ప్రత్యేక తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 28వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు సమావేశం జరగనుంది.గతంలో 2009, డిసెంబర్ 9న అప్పటి ఆర్థిక కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశారు. అప్పుడు కూడా ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో సిడబ్ల్యుసి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్నే చిదంబరం ప్రకటించారు. తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ఈసారి మాత్రం 28న జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కూడా కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే త్వరలోనే తెలంగాణపై నిర్ణయం వెలువడనుందని ప్రకటించారు. ఈ నెల 27న ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఆహార భద్రత బిల్లుపై సమావేశం జరగనుంది. పనిలో పనిగా తెలంగాణపై కూడా త్వరగా తేల్చివేయాలనే ఆలోచనతోనే ఎఐసిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తెలంగాణపై వామపక్షాల ఐక్య ఫ్రంట్
తెలంగాణ సాధనకు ఐదు వామపక్ష పార్టీల అధ్వర్యంలో ఉమ్మడి వేదిక ఏర్పాటు చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ తెల్చాకుండా అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
లీకేజీల పేరుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సొంత ఇమేజ్ కోసం పాకులాడుతు ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఏర్పారుస్తున్నారని నారాయణ చెప్పారు. ప్యాకేజీలతో సమస్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. ఐదు వామపక్షపార్టీల ఆధ్వర్యంలో త్వరలో భవిష్యత్తు కార్యచరణ రూపొందిస్తామని నారాయణ అన్నారు.












Click it and Unblock the Notifications