'అప్‌సెట్: అక్టోబరులో తెలంగాణ ఇస్తే వారేం చేస్తారు?'

సీమాంధ్ర నేతలు ఇప్పటికే అధిష్టానం తెలంగాణ ఇస్తుందనే అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చేసిందని, ఇప్పుడు తాము ఎలాంటి ఉద్యమాలు చేసినా లాభం లేదనే అభిప్రాయంతో కూడా ఉన్నారని అంటున్నారు. అనంతపురంలో త్వరలో జరుగనున్న సమైక్య సభ ద్వారా తమ సమైక్యాంధ్ర గళం వినిపించాలని శైలజానాథ్ వంటి వారు అనుకుంటున్నా.. దానిని అధిష్టానం లెక్కలోకి తీసుకునే అవకాశాలు లేవంటున్నారు.
పది రోజుల క్రితం జరిగిన కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు అనుకూలంగా, బొత్స కూడా దాదాపు అదే విధంగా రోడ్ మ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. కిరణ్ విభజనను గట్టిగా వ్యతిరేకించారు. బొత్స మాత్రం విభజనను వ్యతిరేకిస్తూ.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.
కోర్ కమిటీ భేటీకి ముందు కిరణ్ మాట్లాడుతూ... తమ పార్టీ అధిష్టానం తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. అలా చెప్పినప్పటికీ తెలంగాణ ఇస్తే కిరణ్ రాజీనామా చేస్తారని గల్లీ నుండి ఢిల్లీ వరకు జోరుగా ప్రచారం సాగింది. ఆ వార్తలను ముఖ్యమంత్రి కొట్టిపారేశారు. తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతుందో తనకు తెలియని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ తర్వాత జరిగిన కోర్ కమిటీ భేటీలో కిరణ్ సమైక్యాంధ్రకు అనుకూలంగా గట్టి వాదన వినిపించారు. తెలంగాణ ఇస్తే నక్సలిజం ఊపందుకుంటుందని, బిజెపి తెలంగాణ ప్రాంతంలో పట్టు సాధిస్తుందని, అంతేకాకుండా బిజెపి - మజ్లిస్ పార్టీల మధ్య వివాదాలు చోటు చేసుకుంటాయని కూడా అధిష్టానం ముందు చెప్పారట. అదే సమయంలో ఆంధ్రా - తెలంగాణల మధ్య కృష్ణ, గోదావరి నీటి వివాదం రాజుకుంటుందని, ఇరు రాష్ట్రాలపై పెట్టుబడుల ప్రభావం కూడా పడుతుందని చెప్పారట.
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ కంటే భారీ ప్యాకేజీ ఇవ్వడం మంచిదని చెప్పారని, ప్యాకేజీ పైన చర్చించేందుకు కిరణ్ ఆసక్తి చూపినా అధినేత్రి అందుకు సిద్ధపడలేదని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కిరణ్ సమైక్యానికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారని రోజుకో వార్త బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో కిరణ్ తీరు పట్ల అధిష్టానం అప్ సెట్ అయినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. కిరణ్ హైదరాబాదులో నివసిస్తున్నప్పటికీ విభజన జరిగితే అతను ఆంధ్రా ప్రాంతానికే వెళ్తాడని అంటున్నారు.
ఈ నేపథ్యంలో తన రాజకీయ మనుగడ కోసం కిరణ్ లీక్‌లు ఇప్పించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలా చేయకుండా సైలెంట్‌గా ఉంటే సీమాంధ్రలో ఆయన రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని, అందుకే లీక్‌లు ఇప్పించి ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినప్పటికీ.. సీమాంధ్రలో తాను పట్టు సాధించాలంటే సమైక్య ముద్ర వేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే లీకులు ఇప్పించి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కోర్ కమిటీలో ఇంతగా సమైక్య గళం వినిపించిన కిరణ్.. అధిష్టానం తెలంగాణను ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ విడిపోతుంది. అప్పుడు కిరణ్ ముఖ్యమంత్రిగా ఉండరని, ఈ నేపథ్యంలో ఆయన సమైక్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయా అనే చర్చ సాగుతోంది.
అయితే కిరణ్ అంత దూరం వెళ్లరని, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడే ఉంటారని మరికొందరు చెబుతున్నారు. కిరణ్ పై చర్చ సాగుతున్నా బొత్స మాత్రం అధిష్టానానికే కట్టుబడి ఉంటారని, ఇప్పుడు సమైక్యవాదం గట్టిగా వినిపిస్తున్న శైలజానాథ్, టిజి వెంకటేష్ వంటి వారు కూడా హైకమాండ్ నిర్ణయానికి తలొగ్గక తప్పదంటున్నారు.












Click it and Unblock the Notifications