జైపాల్‌రెడ్డి మంత్రాంగం: అధిష్టానానికి సీమాంధ్ర బ్రహ్మాస్త్రం
హైదరాబాద్: సీమాంధ్ర నేతలు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. తమ బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకునే చర్యల్లో భాగంగా సీమాంధ్ర మంత్రులు బుధవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో భేటీ అయ్యారు. విభజన జరిగితే తాము పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని, జరగరానిది జరిగితే మాత్రం ఎలాంటి కఠిన నిర్ణయాలకు వెనుకాడే ప్రసక్తి లేదన్నారు.
తమతో సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రులు అందరూ కలిసి రావాలని, వస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. విభజనకు అనుకూలంగా జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో సీమాంధ్ర మంత్రులు భేటీ అయి రాష్ట్ర రాజకీయాలను మరోసారి హీటెక్కించారు. ఎల్లుండి అధిష్టానాన్ని కలిసి తమ అభ్యంతరాన్ని తెలియజేయాలని, లేదంటే రాజీనామాలు చేస్తామని, పార్టీలో కొనసాగలేని పెద్దలకు చెప్పాలని నిర్ణయించుకున్నారు.

తమతో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కలిసి వచ్చే పరిస్థితులు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో తామే విభజనను అడ్డుకోవాలనుకుంటున్నారట. ఎవరూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పాల్సిన అవసరం లేదని, విభజన జరిగితే రాజీనామా అస్త్రాన్నే ప్రయోగించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. 2009లో తెలంగాణ ప్రకటించినప్పుడు సీమాంధ్ర నేతలు పదవులకు మాత్రమే రాజీనామా చేశారు.
ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పార్టీకి కూడా రాజీనామా చేస్తామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని, తెలంగాణ సెంటిమెంటు ఉందనే బూచీలు చూపి విభజన చేస్తామంటే ఒప్పుకునేది లేదని వారు చెబుతున్నారు. తెలంగాణ ప్రాంత నేతల స్థాయిలో తమ ప్రాంత నేతలు లాబియింగ్ చేయడం లేదని కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణ కోసం జోరుగా లాబియింగ్ చేస్తున్నారని వారు చెబుతున్నారు.
తాము కూడా అదేస్థాయిలో లాబీయింగ్ చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా చూడాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సీమాంధ్ర ముఖ్య నేతల పైన ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు అందరూ కలిసి వస్తారా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. గతంలో సమైక్యవాదం వినిపించిన కావూరి సాంబశివ రావు ఇప్పుడు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడతానని చెప్పారు.
పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ఇతర పలువురు నేతలు కూడా తాము సమైక్యవాదులమని చెబుతూనే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. ఈ కారణంగా భేటీ అయిన మంత్రులతో ఎందరు ఇతర నేతలు కలిసి వస్తారనేది ప్రశ్నగా మారింది. అయితే విభజిస్తే మాత్రం తాము దేనికైనా సిద్ధమని అధిష్టానానికి గట్టి సంకేతాలు ఇచ్చేందుకు మాత్రం మంత్రులు సిద్ధమయ్యారు. ఇటీవల లగడపాటి రాజగోపాల్ చెప్పినట్లు వారి వద్ద మిగిలిన ఆఖరు బ్రహ్మాస్త్రం పార్టీకీ రాజీనామే కావొచ్చు. అధిష్టానం సీమాంధ్ర నేతల అల్టిమేటానికి బెదురుతుందా, తెలంగాణ లాబీయిగ్ ఫలిస్తుందా అనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది.












Click it and Unblock the Notifications