కొండా సురేఖ తిరుగు'బాట': సొంతగూటికి వెళ్తారా?

అయితే గత కొంతకాలంగా వారు పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. రెండు రోజుల క్రితం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు విభజన విషయమై రాజీనామా చేయడంతో మిగతా తెలంగాణ నేతల వలె కొండా సురేఖ ఘాటుగా స్పందించారు. శుక్రవారం సాయంత్రం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో వారు భేటీ అయినా.. వారికి అధిష్టానం నుండి అనుకూల సంకేతాలు రాలేదని సమాచారం.
అయితే రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లుగా మాత్రం తెలుస్తోంది. దీంతో అధిష్టానం తెలంగాణపై వైఖరి చెప్పకుంటే పార్టీ వీడేందుకు కూడా కొండా దంపతులు సిద్ధంగా ఉన్నారని సమాచారం. అదే సమయంలో కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉండటంతో తిరిగి సొంతగూటికి వెళ్లాలనే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కూడా తమకు సముచిత గౌరవం దక్కడం లేదనే భావనతో వారు ఉన్నారట.
నమ్మి వచ్చిన పార్టీలోనే ప్రతికూల పరిస్థితులు ఎదురవడం, వివక్షకు గురి కావడంతో వారికి ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. కాంగ్రెసు పార్టీలోని అతిరథ మహారథులందరూ వీరికి అనుకూలంగా ఉన్నారన్న ప్రచారం ఉండనే ఉంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ తదితరులు అనుకూలంగా ఉన్నారట. తెరాస వైపు వెళ్లే అవకాశాలు లేకపోవడంతో కాంగ్రెసు వైపే మొగ్గు చూపనున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications