ఆచితూచి స్పందిద్దాం: కెసిఆర్, కంటతడి పెట్టిన కెకె
హైదరాబాద్: కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఈ రెండు రోజులు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ఆ పరిణామాలపై ఆచితూచి స్పందిద్దామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి నేతలకు సూచించారు. పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు నివాసంలో ఐకాస నేతలతో కెసిఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ పై మంగళవారం కాంగ్రెసు పార్టీ తన విధానాన్ని స్పష్టం చేస్తుందని, ప్రకటన తర్వాత పార్టీలోని అందరు కలిసి చర్చించుకుందామని చెప్పారు.

కాంగ్రెస్ నేతల ద్వారా ఆరా తీసిన మేరకు ఆ పార్టీ పది జిల్లాల తెలంగాణకు సుముఖంగానే ఉందని, హైదరాబాద్ పైనే కొంత కిరికిరి పెడితే పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌పై కిరికిరి పెడితే ఏయే అంశాలపై పెట్టవచ్చనే చర్చ కూడా ఈ సందర్భంగా జరిగింది. మంగళవారం కాంగ్రెస్ నుంచి ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వచ్చినప్పటికీ, ఆగస్టు ఒకటిన ఐకాసఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాను యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు.
కేశవరావు కంటతడి
ఈ భేటీలో కెకె కంటతడి పెట్టారు. తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమయ్యే సమయం వచ్చిందని ఉద్విగ్నంగా చెప్పిన ఆయన కెసిఆర్‌ను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తాను రాసిన రాజీనామా లేఖ పరిణామాలను వివరించారు.












Click it and Unblock the Notifications