మడమ తిప్పడం: జగన్‌కు సురేఖ లేఖ, పూర్తి పాఠం...

'మాట తప్పం.. మడమ తిప్పం అనేది వైయస్ లక్ష్యం. కానీ, మాట తప్పడం.. మడమ తిప్పడం, లక్షల కోట్ల సంపాదన మీ లక్ష్యం. నిబద్ధత కలిగిన రాజకీయాలంటే మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఉండటం. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అలాగే ఉండేవారు. మీకు మాత్రం మాట తప్పడం మడమ తిప్పడమే రాజకీయం. లక్షల కోట్ల సంపాదన కోసం మీరు అనుసరిస్తున్న విధానం ఇదే.
వైయస్ హఠాన్మరణం తర్వాత, ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన కుటుంబానికి అండగా నిలవాలని ఆయన కుమారుడైన మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయాలనే ఆకాంక్షతో మీ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నా. మీకు మద్దతుగా నిలిచినందుకు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నా భర్త కొండా మురళీధర్ రావు ఎమ్మెల్సీ పదవిని, నేను ఎమ్మెల్యే పదవిని కోల్పోయాను. రాజకీయంగా అటు ప్రజలకు సేవ చేయలేని స్థితిలో అన్ని విధాలా నష్టపోయాం.
మన పార్టీ తరపున ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం రాగా, తెలంగాణ నుంచి నా భర్తకు ఇవ్వమని అడిగాను. కానీ, మీరు ఆ పదవిని మాకు ఇవ్వకుండా అప్పుడే పార్టీ మారిన ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇచ్చారు. అయినా మేం బాధపడలేదు. పార్టీ ఆఫీసులో గతంలో జరిగిన పార్టీ మీటింగ్‌లో నన్ను స్టేజీపై విజయమ్మ పక్కన కూర్చొబెట్టి, తర్వాత కొన్నాళ్లకు కింద కూర్చోబెట్టారు. అయినా ఇది పద్ధతా? అని ఏనాడూ మనస్తాపం చెందలేదు.
మీతో ఉన్నాక మేం రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో నష్టపోయాం. మేమే కాకుండా మమ్మల్ని నమ్ముకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నష్టపోయారు. మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి, నా భర్త ఎమ్మెల్సీ పదవి పోయినా మేం పెద్దగా బాధపడలేదు. మా కష్టాలు మేం అనుభవించాం.
మీరు జైలుకు వెళ్లిన తర్వాత మన పార్టీ ఒక ప్రైవేట్ కంపెనీగా మారిపోయింది. ప్రజా బలం లేని కొందరు నాయకులు బ్రోకర్ల అవతారం ఎత్తి డబ్బులు తీసుకొని ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్టు అమ్ముకోవడానికి బేరం పెడుతున్నారు. అలాంటి వారిని మీరు నమ్మి వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజా బలం లేని వారికి పార్టీలో పెత్తనం ఇస్తున్నారు.
తెలంగాణకు సంబంధించి మీరు ఇడుపులపాయ ప్లీనరీలో వైయస్ సమాధి సాక్షిగా ఇచ్చిన మాటకు, చేసిన తీర్మానానికి కట్టుబడి ఉంటారని అనుకున్నాం. సీమాంధ్రకు చెందిన 16 మంది పార్టీ ఎమ్మెల్యేలు సమైక్యాంధ్రకు అనుకూలంగా రాజీనామాలు సమర్పించినప్పుడు అయోమయ పరిస్థితి నెలకొనడంతో తెలంగాణ విషయంలో పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని విజయమ్మ గారిని మేం అడిగాం. తెలంగాణకు అనుకూలంగా పార్టీ స్టాండ్ ఉంటుందని, ఇడుపులపాయలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉంటామని, విజయమ్మను బహిరంగంగా ఒక ప్రకటన చేయమని కోరాం. కానీ, ఆమె స్పందించలేదు.
సమైక్యాంధ్ర వైపే మొగ్గు చూపుతున్నట్లు ఒక సమాచార పత్రాన్ని మాకు అందించారు. గతంలో చెప్పిందేమిటి? ఇప్పుడు చెబుతున్నది, చేస్తున్నది ఏమిటి? మన పార్టీ తెలంగాణ నేతలను సంప్రదించకుండానే మీరు ఇలా యూ టర్న్ ఎందుకు తీసుకున్నారో స్పష్టం చేయాలి. మీ వైఖరితో తెలంగాణ బిడ్డలుగా మా ఆత్మాభిమానం దెబ్బతింది. తెలంగాణపై పార్టీ విధానాన్ని మార్చుకున్నారా? రెండేళ్ల కిందటే పార్టీ తొలి ప్లీనరీలో తెలంగాణ ఉద్యమం పట్ల గౌరవం ఉందని, కేంద్రం ప్రత్యేక తెలంగాణ ప్రకటిస్తే అభ్యంతరం తెలపమని తీర్మానించాం.
కానీ, సీమాంధ్ర ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాలు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లు కాదా? మాట తప్పలేదా? పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తామని, తెలంగాణ ఇస్తే అడ్డుకోమని విజయమ్మ స్పష్టం చేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు కూడా అర్పించారు. అయినా ఇప్పడు యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు?.
మహానేత వైయస్ అకాల మరణం చెందితే సీమాంధ్రలో కన్నా తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ మంది బాధతో చనిపోయారు. అలాంటి వారిపై మీకు ప్రేమ లేదా!? తెలంగాణ ప్రాంత బిడ్డలుగా ప్రత్యేక రాష్ట్రం వస్తుందంటే అడ్డు తగిలి ఆత్మాభిమానాన్ని చంపుకోలేం. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామా నిర్ణయం పార్టీదా? వారి వ్యక్తిగతమా స్పష్టం చేయాలి. ఈ విషయాన్ని విజయమ్మతో జరిగిన సమావేశంలో అడిగినా ఆమె ఏమీ చెప్పలేదు.
తెలంగాణ ఎలాగూ వస్తుందని, రాష్ట్రం విడిపోవడం ఖాయమని అనుకున్న మీరు సీట్లు, ఓట్ల గురించి మన పార్టీ విధానాన్ని మార్చుకున్నారా? ఆ కొత్త స్టాండ్ ఏమిటో చెప్పాలి. ఇప్పటికైనా తెలంగాణ విషయంలో మన పార్టీ విధానం ఏమిటి? ఇడుపులపాయలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామా? లేదా ఇచ్చిన మాటను మరిచి సమైక్యవాదం వైపు మొగ్గు చూపుతున్నామా? మీరే స్పష్టం చేయాలి.
ఇట్లు
కొండా సురేఖ,
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పాలక మండలి సభ్యురాలు, మాజీ మంత్రి












Click it and Unblock the Notifications