చిరుకు మొగల్తూరులో షాక్, బాబుకు పట్టం! (పిక్చర్స్)
హైదరాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికలలో పలువురు ముఖ్య నేతలకు షాక్ తగిలింది. కొందరు సొంత గ్రామాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోకపోగా, మరికొందరు తమ నియోజకవర్గంలో తమ పట్టును నిలబెట్టుకోలేకపోయారు. తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి... ఇలా అన్ని పార్టీలలు పలువురు నేతల పరిస్థితి ఇలాగే ఉంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కడప జిల్లా పులివెందులలోని వేంపల్లెలో షాక్ తగిలింది. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లె ఉంది. ఇది మేజర్ పంచాయతీ. ఇక్కడ టిడిపి అభ్యర్థి గెలుపొందారు.
కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావుకు కూడా స్వగ్రామం దోసపాడులో ఎదురు దెబ్బ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు జూపల్లి కృష్ణారావు పరిస్థితి అదే.

ఎన్టీఆర్
కృష్ణా జిల్లాలోని పామర్రు మండలంలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. బసవతారకం స్వగ్రామం కొమరోలులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గెలుపొందారు. మూడు వేలకు పైగా ఓట్లతో టిడిపి అభ్యర్థి విజయం సాధించారు.

వైయస్ జగన్
వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కంచుకోట అయిన పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో తెలుగుదేశం పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందారు. పులివెందులకు ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

చిరంజీవి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్‌గా గెలుపొందారు. ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్ సొంతూరు కరీంనగర్ జిల్లా మానకొండూరులో టిడిపి అభ్యర్థి విజయం సాధించారు.

కావూరి సాంబశివ రావు
కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా దోసపాడులో కాంగ్రెసు పార్టీ మద్దతుదారుపై టిడిపి మద్దతుదారు గెలుపొందారు. టిడిపి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న చొప్పదండి నియోజకవర్గం చొప్పదండి పంచాయతీ ఎన్నికల్లో తెరాస మద్దతుదారు గెలుపొందారు.

దామోదర రాజనర్సింహ
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్ జిల్లా ఆందోల్‌లో ఎక్కువ శాతం కాంగ్రెసు మద్దతుదారులు గెలిచారు. మంత్రి గీతా రెడ్డి నియోజకవర్గం జహీరాబాద్‌లోను దాదాపు సగం కైవసం చేసుకున్నారు. జగ్గారెడ్డి నియోజకవర్గంలో 74కు గాను 27 పంచాయతీలను గెలుపొందారు.

కిల్లి కృపారాణి
కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శ్రీకాకుళం జిల్లా పోలవరంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ సొంతూరు కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబళంలో సిపిఎం మద్దతుదారు విజయం సాధించారు.

నీరజా రెడ్డి
కర్నూలు జిల్లా ఎమ్మెల్యే నీరజా రెడ్డి సవగ్రామం తెర్నేకలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారు, మంత్రి పినిపె విశ్వరూప్ స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా నడవపల్లిలో టిడిపి మద్దతుదారు, మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి స్వగ్రామం యర్రగొండపాలెంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారు, మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్వగ్రామం వరంగల్ జిల్లా ఖిలాషాపురంలో కాంగ్రెసు మద్దతుదారు గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం ఇరవయ్యేళ్లలో ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications