'టి' కి సీతయ్య ఒకే: టిడిపి ఎంపిల రాజీనామా

కాంగ్రెసు పార్టీ తీరు తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్న విధంగా ఉందన్నారు. సోనియా గాంధీ ఏకపక్షంగా ఒక ప్రాంత ప్రజల కళ్లలో దుమ్ము కొట్టారన్నారు. సీమాంధ్రలో బీళ్లుగా మారే లక్షలాది ఎకరాల మాట ఏమిటని ప్రశ్నించారు. ఒక కంట్లో కారం కొట్టి మరో కంట్లో కాటుక పెట్టినట్లుగా కాంగ్రెసు పార్టీ తీరు ఉందన్నారు.
రెండు నాల్కల ధోరణి చాలా ప్రమాదకరమని ఆయన వైయస్‌ను ఉద్దేశించి మండిపడ్డారు. గతంలో తెలంగాణ వాదాన్ని వైయస్ రాజశేఖర రెడ్డే రెచ్చగొట్టారని, ఆ తర్వాత ఎన్నికల సమయంలో హైదరాబాదు వెళ్తే వీసా తీసుకోవాలా అని ప్రశ్నించి సీమాంధ్ర ప్రాంతాన్ని రెచ్చగొట్టారన్నారు. ఇది చాలా ప్రమాదకరమన్నారు. కాలానికి, ఓ ప్రాంత అభీష్టానికి తలవంచి విభజనను తాను అంగీకరిస్తున్నప్పటికీ కేంద్రం వైఖరిని నిరసిస్తున్నానన్నారు.
సోనియా నీచ, నికృష్టంగా వ్యవహరించారన్నారు. శ్రీకాకుళం నుండి తడ వరకు ఉప్పు సముద్రాన్ని చూసి సీమాంధ్రులు సంతృప్తి చెందాలా అని ప్రశ్నించారు. ఎవరికి నష్టం కలుగకుండా చూడాల్సిన బాధ్యత వారికి లేదా అని ప్రశ్నించారు. సంప్రదింపులు, సమాలోచనలు లేకుండా ఓ ప్రాంతాన్ని రోడ్డు పైకి నెట్టేస్తారా అన్నారు. దుష్ట సంస్కృతి టిడిపిది కాదని కాంగ్రెసు పార్టీదే అన్నారు. టిడిపిది కన్న పేగు మమకారమన్నారు.
సీతయ్య రాజీనామా చేస్తారా?
కాగా హరికృష్ణ రెండు మూడు రోజుల్లో రాజీనామా చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఐదుగురు టిడిపి ఎంపీలు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఏ క్షణంలోనైనా రాజీనామా చేసే అవకాశాలున్నాయంటున్నారు.
సీమాంధ్ర టిడిపి ఎంపిల రాజీనామా
తమ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఎపి కాంగ్రెసు పార్టీ ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానిస్తున్నారని టిడిపి ఎంపిలు కొణకళ్ల నారాయణ, సిఎం రమేష్ మండిపడ్డారు. కాంగ్రెసు ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాము రాజీనామాలు చేస్తున్నట్లు ఐదుగురు టిడిపి ఎంపీలు ప్రకటించారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్రం ఏకపక్ష నిర్ణయం వల్లనే ఈ అరిష్టమన్నారు. రాజధాని నిర్మాణం విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు.
పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఏం చేయలేని పరిస్థితి ఉన్నందున తాము రాజీనామాలు చేస్తున్నామన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించకుండా డిగ్గీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ తీరు దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా ఉందన్నారు. తమ ప్రాంతానికి న్యాయం చేసేందుకు కేంద్రం దిగి వచ్చే వరకు తాము ఉద్యమిస్తామన్నారు. వైయస్సే తెలంగాణకు అనుకూలమని కాంగ్రెసు పార్టీ నేతలే చెబుతున్నారన్నారు.
చర్చలు జరపకుండా కాంగ్రెసు తమ నిర్ణయాన్ని ప్రజల పైన రుద్దారన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రజలను మభ్యపెడుతోందన్నారు. కాగా రాజీనామా చేసిన ఎంపీలలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కొణకళ్ల నారాయణ, శివప్రసాద్, సిఎం రమేష్, సుజనా చౌదరిలు ఉన్నారు.












Click it and Unblock the Notifications