ఫొటోలు: గాంధీ కుటుంబంపై సెగలు, విగ్రహాలు టార్గెట్
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై సీమాంధ్ర పొగలు, సెగలు కక్కుతోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబ సభ్యులపై సీమాంధ్ర ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెహ్రూ మొదలు సోనియా గాంధీ వరకు - ఎవరినీ వదిలిపెట్టకుండా వారి విగ్రహాలను, చిత్రాలను టార్గెట్ చేసుకున్నారు. విగ్రహాలను ధ్వంసం చేయడం, దగ్ధం చేయడం, సోనియా గాంధీ చిత్రాలను తగులబెట్టడం అనే కార్యక్రమాలు జరుగుతున్నాయి.
సీమాంధ్ర ఆందోళనకారులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను వివిధ ప్రాంతాల్లో ధ్వంసం చేశారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని దుమ్మెత్తి పోస్తూ ఆమె దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. 1950కి ముందు భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కున్నారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కున్నారు.
సీమాంధ్రలో విగ్రహాల ధ్వంసంపై ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. యూపిఏ, సిడబ్ల్యూసి తెలంగాణకు అనుకూలంగా మూడు రోజుల క్రితం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిపై అప్పటి నుంచి సీమాంధ్రలో బంద్, రాస్తారోకోలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు పలు ప్రాంతాలలో దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల విగ్రహాలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అనంతపురంలో ఇందిరా విగ్రహానికి నిప్పు పెట్టి కాల్చివేశారు. కొన్ని ప్రాంతాల్లో చెప్పుల దండలు వేశారు.

కర్నూలులో ఇలా...
ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు. తెలంగాణ వ్యతిరేక ఆందోళనలతో ఇప్పుడు రగిలిపోతోంది. గురువారంనాడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ వ్యతిరేక ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

కడపలో ఇలా...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఆందోళనకారులు కడపలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నించారు. సమైక్యవాదులు ఇందిరా గాంధీని కూడా టార్గెట్ చేసుకున్నారు. కడప దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సొంత జిల్లా.

చిత్తూరులో...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ చిత్తూరులో మహిళా ఆందోళనకారులు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు చెందినవారు.

అనంతపురంలో ఇలా..
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అనంతపురం అట్టుకుడుకుతోంది. తెలంగాణ వ్యతిరేక ఆందోళనకారులు బుధవారంనాడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసి, రోడ్డుపై పడేశారు. అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఆరుగురు రాజీనామాలు చేశారు.

విశాఖపట్నంలో ఇలా..
విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉంది. ఇక్కడి విద్యార్థులు మొదటి నుంచి సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్నారు. విశాఖపట్నంలో బుధవారంనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

పొట్టి శ్రీరాములుకు తలొగ్గారు
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారు. ఆయన త్యాగానికి భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తలొంచాల్సి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.












Click it and Unblock the Notifications