మంత్రి గల్లా రాజీనామా: వెనక్కి తీసుకోవాలని సిఎం

ఇదిలావుంటే, సమైక్యాంధ్ర కోసం రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి తమ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేయడమే కాకుండా ప్రజల్లో కలిసి ఉద్యమంలో పాల్గొననున్నారు. మంత్రి గల్లా గతరాత్రే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి తన రాజీనామా లేఖను అందజేసినట్లు తెలిసింది. సమైక్యాంధ్ర కోసం చిత్తూరు జిల్లాలో ఉద్యమం ఊపందుకోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది.
బాలరాజుకు చేదు అనుభవం
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజును విశాఖపట్నం విమానాశ్రయం వెలుపల సమైక్యాంధ్ర ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ చేరుకున్న ఆయన బయటకు వస్తుండగా ఆందోళనకారులు రోడ్డుపైన బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను సమైక్యవాదినని, రాష్ట్రం విడిపోకూడదని కోరుకుంటున్నాని చెప్పారు. ఈ సందర్భంగా 'జై సమైక్యాంధ్ర' అని మంత్రి నినాదం చేయడంతో ఆందోళనకారులు శాంతించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడం వల్ల కలిగే ప్రయోజనాలపై చర్చించామన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని సిడబ్ల్యుసి వెనక్కు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రసమితి నేత కేసీఆర్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలను మంత్రి బాలరాజు తప్పుబట్టారు.
హైదరాబాద్‌ను యుటిగా చేయాలి: సాయిప్రతాప్
రాష్ట్ర విభజన ప్రక్రియపై చాలా కసరత్తు చేయాల్సి ఉందని పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఉన్నతస్థాయి కమిటీకి నివేదిస్తామన్నారు. ఆయన ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రవాసులను రెచ్చగొట్టే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు మాట్లాడటం సరికాదన్నారు.
కాంగ్రెసు నేతలు అసమగ్ర విభజన చేసిన అధిష్టానంతో పోరాడాలని, రోడ్లపై కాదని తెలుగుదేశం పార్టీ నేత అశోక్ గజపతి రాజు అన్నారు. ఉమ్మడి కుటుంబం విడిపోతే ఒకరికి ఆస్తులు ఇచ్చి, మరొకరిని వట్టి చేతులతో ఎలా వెళ్లిపోమంటారని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెసుపై మండిపడ్డ బుద్దప్రసాద్
అవనిగడ్డ, ఆగస్టు 4 : రాజకీయ ప్రయోజనాలకోసం కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్ర సమైక్యతను తాకట్టుపెట్టిందని, ఈ విషయంలో సమైక్యవాదులు హైకమాండ్‌కు బుద్ధి వచ్చే విధంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని మాజీమంత్రి మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. దివంగత మాజీమంత్రి మండలి వెంకటకృష్ణారావు జయంతిని పురస్కరించుకొని కృష్ణాజిల్లా అవనిగడ్డలో మండలి వెంకటకృష్ణారావు విగ్రహానికి బుద్ధప్రసాద్, దేవినేని రాజశేఖర్(నెహ్రు), రాష్ట్ర గ్రంథాలయ అధ్యక్షులు తుర్లపాటి కుటుంబరావు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బుద్ధప్రసాద్ మాట్లాడుతూ - సమైక్య రాష్ట్రంలోనే డెల్టా ప్రాంతానికి సాగునీరు ఇవ్వడంలో ఎన్నో అడ్డంకులు కల్పించిన నేతలు విభజన పిదప సాగునీరు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
1972లో జై ఆంధ్రా ఉద్యమం కృష్ణాజిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో తన తండ్రి సమైక్యవాదిగా నిలిచి ఎదురొడ్డి పోరాడారని, ఆయనకు బొట్టం శ్రీరామమూర్తి, లుకలాపు లక్ష్మణదాసు అండగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఆనాడు సమైక్యవాదాన్ని బలపరచిన నాయకులకు శక్తిగా ఇందిరాగాంధీ ఉన్నారన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడదీస్తే దేశభద్రతకు ముప్పు ఉందని నాడు ఇందిరాగాంధీ ప్రకటించిన విషయం నేటి కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం గుర్తించాలన్నారు.












Click it and Unblock the Notifications