రాష్ట్ర ఏర్పాటుతో ఆగదు, సిఎంను కాను: కెసిఆర్

తెలంగాణను పునర్నిర్మిస్తామంటే కొందరు సీమాంధ్ర నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, పునర్నిర్మాణం అంటే అసెంబ్లీని మళ్లీ నిర్మించడం కాదని, ఈ ప్రాంతంలో జరిగిన జీవన విధ్వంసాన్ని తాము పునర్నిర్మిస్తామని చెప్పారు. ఇందు కోసం అందరం కలిసి పని చేయాలన్నారు. అసమానలతలు, అంతరాలు తగ్గించడమే పునర్నిర్మాణం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజకీయ స్వార్థం కోసం కాదన్నారు. రాష్ట్ర ఏర్పాటుతోనే ఉద్యమం ఆగిపోదన్నారు. పునర్నిర్మాణం కోసం ఉద్యమిస్తామన్నారు.
పెట్టుబడులకు హైదరాబాద్ అత్యంత అనుకూలమని ప్రపంచ పారిశ్రామికవేత్తలే చెప్పారన్నారు. ఇక్కడి వాతావరణం అన్ని రకాలుగా సహకరిస్తుందని చెప్పారు. నిజాం పాలనలోనే ఇక్కడ వందకు పైగా కంపెనీలు ఉన్నాయని తెలిపారు. మణుగూరులో పెట్టాల్సిన థర్మల్ పవర్ ప్లాంటును విజయవాడకు తరలించారన్నారు. నిజాం షుగర్స్‌ను నాశనం చేశారన్నారు. తెలంగాణలో మొత్తం నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, రాష్ట్రం ఏర్పడ్డాక ప్రారంభంలో విద్యుత్ సమస్య ఉంటుందన్నారు.
కొత్త రాష్ట్రమైన చత్తీస్‌గఢ్‌లో ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇస్తున్నారని, రానున్న పదేళ్లలో 10వేల మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రం తయారు చేసుకునేలా ప్రణాళిక ఉందని, తద్వారా విద్యుత్ సమస్యను అధిగమిస్తామన్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక ఐదేళ్లలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉంటుందన్నారు. బొగ్గు గనులు మనకు దేవుడు ఇచ్చిన వరమన్నారు. సహజవనరులకు పుట్టినిల్లు తెలంగాణ అన్నారు. తెలంగాణ వచ్చాక మావోయిస్టులపై ఇప్పటిలా దాష్టీకం ఉండదన్నారు.
పునర్నిర్మాణంలో తెరాస పాత్ర.. రాజకీయాలపై స్పందించను
తెలంగాణ పునర్నిర్మాణంలో తెరాస పాత్ర ఉంటుందన్నారు. ఎన్ని ఉద్యమాలు జరిగినా తెలంగాణ పునర్నిర్మాణం జరగలేదన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయ్యే వరకు తాను రాజకీయాలపై మాట్లాడదల్చుకోలేదని చెప్పారు. తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో అడ్డంకులు వస్తాయేమోననే ఆందోళన ఉందన్నారు. ఇంత ఉద్యమంలో ఇంకెవరైనా విమర్శలు ఎదుర్కొని తన స్థానంలో ఉంటే ఆత్మహత్య చేసుకునే వారన్నారు. తనకు ఎవరు బాసులు లేరని, తెలంగాణ ప్రజలే తన బాసులు అన్నారు.
చిత్రపరిశ్రమను పెంచుకుంటాం
తెలంగాణ వచ్చాక చిత్ర పరిశ్రమను పెంచుకుంటామని చెప్పారు.
ఉర్దూ పుట్టిందే హైదరాబాదులో...
ఉర్దు పుట్టిందే హైదరాబాదులో అన్నారు. ఉర్దూ భాష పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. పది శాతం రిజర్వేషన్ కావాలని తాము ఆశిస్తున్నామన్నారు. వక్ఫ్ భూములను పరిరక్షిస్తామని చెప్పారు. గిరిజన తండాలను పంచాయతీలుగా చేస్తామన్నారు.
పండుగలు, సంస్కృతి
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిపై దాడి జరిగిందన్నారు. దాదాపు కనుమరుగైన బతుకమ్మ పండుగను ఇప్పుడు బాగా జరుపుకుంటున్నామన్నారు. అలాగే మిగతా తెలంగాణ పండుగలను జరుపుతామన్నారు. తెలంగాణ భాషకు అధికారిక హోదా కూడా తీసుకు వచ్చే విషయమై చర్చిస్తున్నట్లు చెప్పారు.
తల తెగినా...
తాము హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ తప్ప మరొకటి అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. సీమాంధ్రలో రాజధాని ఏర్పడే వరకు వారికి ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తామన్నారు. తన తల తెగినా హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా అంగీకరించమన్నారు. తానే కాకుండా తెలంగాణ ప్రజలు ఎవరు దానిని ఒప్పుకోరన్నారు. హైదరాబాదు తెలంగాణే ఇస్తే, తమకు కావాల్సిన తెలంగాణ వచ్చే వరకు పోరాడుతామన్నారు.
భద్రాచలం తెలగాణదే
భద్రాచలం తెలంగాణ ప్రాంతందేనని కెసిఆర్ చెప్పారు. భద్రాచల దేవస్థానాన్ని కట్టించిన రామదాసును నిజాం హయాంలో గోల్కొండ కోటలో పెట్టారని గుర్తు చేశారు. రామదాసు జన్మించిన నేలకొండపల్లి ఖమ్మం జిల్లాదే అన్నారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమైనా... ఆ తర్వాత ఆంధ్రా ప్రాంతంలో కలిసిందన్నారు. బయ్యారం గనులు తెలంగాణవేనని, దాని కోసం మరో ఉద్యమానికైనా సిద్ధమన్నారు.
నిర్బంధ విద్య కల... సిఎంను కాను
నిర్బంధ విద్య తన కల అని కెసిఆర్ అన్నారు. ఇందు కోసం ఉద్యమం అయినా చేస్తానన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా అందరికీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏ హోదాలో ఇదంతా చెబుతున్నారని ఎవరైనా అంటే... ఇది తన కల అన్నారు. తన కలను తాను చెప్పానని తెలిపారు. తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదని, దళితడినే ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. తెరాస అధికారంలోకి, సిఎం పదవి నిర్ణయాధికారం తన చేతిలో ఉన్నా దళితుడినే చేస్తానన్నారు. విలీనం కావాల్సి వచ్చినా తన కలను పెద్దలతో మాట్లాడి నెరవేర్చే ప్రయత్నాలు చేస్తానన్నారు.
నేనేమన్నానంటే...
తాను టిఎన్జీవోలతో భేటీ అయిన సమయంలో వారిని ఉత్సాహపర్చేందుకు... విభజన జరిగితే తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో, ఆంధ్రా ఉద్యోగాలు ఆంధ్రా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని మాత్రమే చెప్పానని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యోగులను పంపిస్తానని తాను చెప్పలేదన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. అయినా తాను చెప్పాననో, మరొకరు చెప్పారనో ఇవన్నీ జరగనవి, ప్రతిదానికి ఓ ప్రాతిపదిక ఉంటుందన్నారు. తాము తెలంగాణలో ఉండే అన్ని ప్రాంతాల వారిని అక్కున చేర్చుకున్నామన్నారు.
ముల్కీ రూల్స్‌ను తుంగలో తొక్కారని, ఎన్టీఆర్ విడుదల చేసిన 610 జివో అముల ఏమయిందని ప్రశ్నించారు. తెలంగాణ వారికి రావాల్సిన ఉద్యోగాలు ఇతరులు దక్కించుకున్నారన్నారు. ఆ ఆప్షన్ అని లక్షాయాభై వేల మంది ఇక్కడే ఉంటే ఇక తెలంగాణ ఎందుకన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అందరూ చిత్తశుద్ధితో కృషి చేయాల్సి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications