హైద్రాబాద్‌లో ప్రతినిధి: రోశయ్య నో, సీమాంధ్రకు సుప్రీం!?

'పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్' అని ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో కేంద్ర ప్రతినిధి కోసం అన్వేషణ ప్రారంభించింది. ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి నారాయణ స్వామి మూడు రోజుల క్రితం రోశయ్యను కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
విభజన తర్వాత పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండబోయే హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్లాలని కోరారట. అయితే ఈ ప్రతిపాదనను రోశయ్య సున్నితంగా తిరస్కరించినట్లుగా సమాచారం. విభజన ప్రక్రియలోగానీ, విభజనానంతర ప్రక్రియలోగానీ తనను ఇన్‌వాల్వ్ చేయవద్దని కోరారట.
తన మనసుకు విరుద్ధంగా వ్యవహరించలేనని రోశయ్య చెప్పారట. వారం రోజుల క్రితం ఆర్థిక మంత్రి చిదంబరం చెన్నైలో రోశయ్యను కలిశారు. విభజనపై నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగిన ఈ భేటీ అప్పట్లోనే చర్చనీయాంశమైంది. ఆ సమావేశ వివరాలు మాత్రం బయటికి రాలేదు. అయితే, హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి నియామకంపై దృష్టి సారించడంతో విభజన విషయంలో కాంగ్రెస్ చాలా దూరం వెళ్లినట్లు స్పష్టమవుతోంది.
హైదరాబాద్‌లో సీమాంద్ర వ్యక్తిని కేంద్ర ప్రతినిధిగా నియమించడంతోపాటు సీమాంధ్ర ప్రాంతంతో తెలంగాణవాసులకు నిర్దిష్ట అవసరాలతో కూడిన అనుసంధానం ఏర్పరచాలనే భావన ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా సీమాంధ్ర ప్రాంతంలో సుప్రీం కోర్టు దక్షిణాది బెంచ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. తమ ప్రాంతంలో హైకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేయాలని గతంలో కోస్తాంధ్రలో న్యాయవాదులు ఉద్యమించారు.
దక్షిణాదిలో సుప్రీం కోర్టు ధర్మాసనం ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది. దానిని సీమాంధ్రలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన గురించి కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల సీమాంద్రులను కొంత వరకు సంతృప్తిపరిచే అవకాశం కూడా ఉందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications