ప్రభుత్వ సలహాల అధిపతి: కెసిఆర్ కల నెరవేరేనా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిడబ్ల్యుసి నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తన భవిష్యత్తు ప్రణాళికను రచించుకున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ పునర్నిర్మాణం పేరు మీద ఆయన కొత్త రాష్ట్రాన్ని ఎలా బంగారు తెలంగాణగా మారుస్తానో చెబుతున్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆదివారం ఏర్పాటు చేసిన మీట్ ప్రెస్ కార్యక్రమంలో ఆయన తెలంగాణ పునర్నిర్మాణానికి చేసే పనుల గురించి వివరించారు. దాదాపుగా ఓ ప్రభుత్వాధినేత పద్ధతిలో ఆయన మాట్లాడారు.
తాను ముఖ్యమంత్రిని కానని ఆయన చెబుతూనే అంతకు మించిన పీఠాన్ని ఆశిస్తున్నట్లు అర్థమవుతోంది. తాను సలహా మండలి అధినేతగా ఉంటానని చెప్పారు. ప్రభుత్వానికి సలహాలు అందించే మండలి అధినేతగా తెలంగాణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపొందించి, అమలు చేసేలా చూస్తానని చెప్పారు. అయితే, కెసిఆర్ చెబుతున్న సలహా మండలికి చట్టబద్దత ఉంటుందా, లేదా అనేది తెలియదు. అటువంటిది కార్యరూపం దాలుస్తుందా, లేదా గ్యారంటీ లేదు.

ఒక వేళ అటువంటి వ్యవస్థ ఒకటి ఏర్పడాలంటే తెరాస అధికారంలోకి రావాల్సి ఉంటుందేమో కూడా తెలియదు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికిప్పుడయితే కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయి. అయితే కాంగ్రెసుకు పూర్తి మెజారిటీ లేదు. తర్వాత జరిగే ఎన్నికల్లో కాంగ్రెసుకు ఆధిక్యత వస్తుందనే అంచనాలు సాగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది కూడా చెప్పలేని స్థితి. అటువంటి సందర్భంలో కెసిఆర్ కల నెరవేరుతుందా అనేది సందేహమే.
తెలంగాణ రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, విద్య, వైద్యం, నీటిపారుదల ప్రాజెక్టుల వంటి అనేక విషయాలు కెసిఆర్ మాట్లాడారు. నిజానికి, అలా జరిగితే బాగుండు అనిపించేలా ఆయన మాటలు చెప్పారు. కానీ, భవిష్యత్తులో ఏర్పడబోయే ప్రభుత్వం అలా నడుచుకుంటుందని గానీ కెసిఆర్ మాటలు వింటుందని గానీ గ్యారంటీ లేదు. కాంగ్రెసు అధికారంలోకి వస్తే లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ పీఠం కెసిఆర్‌కు అప్పగిస్తుందని చెప్పలేం.
తనపై, తన పార్టీపై తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత ఉందని కెసిఆర్ గట్టిగానే నమ్ముతున్నారు. మావోయిస్టుల సామాజిక, ఆర్థిక ఎజెండానే తన ఎజెండా అని ఆయన ప్రకటించారు. మావోయిస్టులతో సాంఘిక సంక్షేమ మంత్రి వంటివారు చర్చలు జరుపుతారని ఆయన అన్నారు. మావోయిస్టుల ఎజెండాను అమలు చేయడానికి అనువుగా చర్చలు ఉంటాయని అన్నారు. మొత్తం మీద, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వం తన కనుసన్నల్లో మాత్రమే నడుస్తుందనే పద్ధతిలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఇస్తే తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని కెసిఆర్ గతంలో ప్రకటించారు. సిడబ్ల్యుసి ప్రకటన వెలుడిన తర్వాత కూడా - తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆ విషయంపై ఆలోచిస్తామని చెప్పారు. ఇప్పటికిప్పుడైతే తెరాస కాంగ్రెసులో విలీనమయ్యే అవకాశాలున్నాయనే భావన బలంగా వ్యక్తమవుతోంది. పార్టీ విలీనం విషయంలో కెసిఆర్ అటువంటి సలహా మండలి వ్యవస్థను కాంగ్రెసు అధిష్టానం వద్ద డిమాండ్‌గా పెడుతారా తెలియదు. కానీ, కెసిఆర్ కలలు బాగానే ఉన్నాయి, గానీ అవి కార్యరూపం దాల్చడం ఆయన చెప్పినంత సులభమా అనేది ప్రశ్న.












Click it and Unblock the Notifications