మాటిచ్చాను, తగ్గేది లేదు కానీ భద్రత కల్పిస్తాం: బాబు

బాబును కలిసిన అనంతరం సచివాలయ ఉద్యోగులు విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్రకు మద్దతు పలకమని తాము బాబును కోరామని అయితే, తాను తెలంగాణపై మాట ఇచ్చానని కాబట్టి వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని, తమ భద్రత కోసం మాత్రం పార్టీ పోరాడుతుందని చెప్పారని వారు అన్నారు. తమకు రక్షణ కల్పిస్తామని, అన్ని రకాలుగా సహకరిస్తానని బాబు చెప్పారని, అన్ని ప్రాంతాల వారికి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారన్నారు. రెండు రోజుల క్రితం ఎపిఎన్జీవోలు కలిసినప్పుడు కూడా బాబు అదే విషయం చెప్పిన విషయం తెలిసిందే.
స్ప్లిట్ ఇండియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయంతో దేశవ్యాప్తంగా స్ప్లిట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైందని టిడిపి ఎంపి సుజనా చౌదరి న్యూఢిల్లీలో ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెసు విభజన నిర్ణయం తీసుకుందన్నారు. ఎకె ఆంటోనీ కమిటీ కాంగ్రెసు పార్టీ అంతర్గతమైనదన్నారు. అన్ని పార్టీలతో అధికారికంగా ఓ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చ జరగాలన్నారు. సీమాంధ్ర ఉద్యమాన్ని అదుపులో పెట్టాల్సింది కాంగ్రెసు పార్టీయే అన్నారు.
జయమంగళం వెంకటరమణకు అస్వస్థత
కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కార్యకర్తలు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆయన గత నాలుగు రోజులుగా సమైక్యాంధ్ర కోసం దీక్ష చేస్తున్నారు.
ఆర్టీసి కార్మికులకు బొత్స విజ్ఞప్తి
ఆర్టీసి కార్మికులు సమ్మె యోచన విరమించుకోవాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆర్టీసి ఒడిదుడుకుల్లో ఉందని, ఇలాంటి సమయంలో సమ్మె నిర్ణయం సరికాదన్నారు.
విద్వేషాలు రెచ్చగొట్టేందుకే..: చలసాని
విద్వేషాలు రెచ్చగొట్టేందుకే కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని ఆంధ్రా మేథావుల సంఘం ఫోరం నేత చలసాని శ్రీనివాస్ అన్నారు. ఎకె ఆంటోనీ నేతృత్వంలోని కమిటీ అనవసరమన్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకే కమిటీని వేశారన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాదును వదులుకునేందుకు సిద్ధంగా లేమన్నారు.
రాజీనామాలు
సమైక్యాంధ్ర కోసం ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ రోజు రాజీనామా చేశారు. అప్పలనాయుడు(నెల్లిమర్ల), జనార్ధన్ థాట్రాజ్(కురుపాం), జయమణి(పార్వతీపురం)లు రాజీనామాలు పంపించారు.












Click it and Unblock the Notifications