తెలంగాణ తీసుకో, హైదరాబాద్ లేకుండా: ఉండవల్లి
రాజమండ్రి: తెలంగాణ ఏర్పడాలని ఉంటే తీసుకో, కానీ హైదరాబాద్‌పై మాత్రం అందరికీ సమాన హక్కులుండాలని కాంగ్రెసు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ మనది కాదట అనే భావన వల్లనే సీమాంధ్రలో పెద్ద యెత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. బయటకు పోతామని అడిగే వారు రాజధానిని వదేలియాల్సిందేనని, తెలంగాణవాదులు బయటకు పోతారని అంటున్నారు కాబట్టి రాజధానిని వదులుకోవాలని ఆయన అన్నారు. శనివారంనాడు ఆయన రాజమండ్రిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినప్పుడు బొంబాయిని మహారాష్ట్రకు వదిలారని, మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులు విడిపోతామని అన్నప్పుడు మద్రాసును వదిలిపెట్టి వెళ్లాలని చెప్పారని, అదే రీతిలో తెలంగాణవాదులు బయటకు పోతామని అంటున్నారు కాబట్టి హైదరాబాదును వదిలేయాలని ఆయన అన్నారు. కాఫీ సెంటర్ పెట్టుకో, టిఫిన్ కార్నర్ పెట్టుకో అని కెసిఆర్ హేళనగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రెండు ప్రాంతాల మధ్య అభద్రతా భావానికి కారణం కెసిఆర్ అని ఆయన తప్పు పట్టారు.

అంకుర్ సినిమాలో తెలంగాణలోని భయంకరమైన స్థితిని కళ్లకు కట్టినట్లు చూపించారని, దొరల పీడనను చూపించారని, అటువంటిదే కెసిఆర్ మళ్లీ తేవాలని అనుకుంటున్నాడని ఆయన అన్నారు. ఫజల్ అలీ కమిషన్ నివేదికకు విరుద్ధంగా అప్పుడు తెలంగాణకు చెందిన బూర్గుల రామకృష్ణారావు మాట్లాడారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రకటన చేయగానే కెసిఆర్‌కు భద్రత లేదనే భావన పెరిగిందని, దీన్నిబట్టి రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. తన ఎజెండా మావోయిస్టు ఎజెండా అని కెసిఆర్ అంటున్నారని,అలా అనకపోతే అనే భయం కెసిఆర్‌ను పట్టుకుందని ఆయన అన్నారు.
కెసిఆర్ పెంచిన ద్వేషం, ఏహ్యభావన వల్ల భవిష్యత్తులో ఎలాంటి యుద్ధం జరుగుబోతోందో ఊహించుకోవచ్చునని ఆయన అన్నారు. జల పంపకాలపై పాకిస్తాన్‌తో, బంగ్గాదేశ్‌తో, చైనాతో మాట్లాడుకోలేదా అని కెసిఆర్ అంటున్నారని, దీన్నిబట్టి కెసిఆర్ ఏ విధంగా వ్యవహరించబోతున్నారో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. కెసిఆర్ వక్రీకరించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కఠోరమైన నిజాలు చెప్పారని, ముఖ్యమంత్రి అయినా సరే కిరణ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పాల్సిందేనని ఆయన అన్నారు. చత్తీస్‌గడ్ పరిస్థితిని ఇక్కడ తీసుకు రావాలని కెసిఆర్ అనుకుంటున్నారా అని ఆయన అన్నారు. ఆరు సూత్రాల పథకం అమలు కాకపోతే తెలంగాణ మంత్రులు ఏం చేశారని ఆయన అడిగారు. రాష్ట్ర విభజనపై శాసనసభలో తీర్మానం పెట్టినప్పుడు విప్‌లు ఉండవని ఆయన అన్నారు. కెసిఆర్ చరిత్రను వక్రీకరించారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పు పట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
అనివార్యమైతే మాత్రమే రాష్ట్రాన్ని విభజించాలని, ఇది రెండో ఉత్తమ ప్రత్యామ్నాయం మాత్రమేనని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని, హైదరాబాద్‌తో గానీ హైదరాబాదు లేకుండా గానీ తెలంగాణ ఇస్తే మావోయిస్టులు పెచ్చరిల్లుతారని చెప్పిందని ఆయన వివరించారు. దేశంలోని టాప్ 17 మంది మావోయిస్టు నాయకులు తెలంగాణవారని, వారిలో 14 మంది కరీంనగర్ జిల్లావారని, దీన్ని బట్టి తెలంగాణ వస్తే పరిస్థితి ఎలా మారుతుందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. మంత్రివర్గంలో తెలగాణవారు కూడా ఉన్నారని, మంత్రివర్గంలో ఉన్నప్పుడు అన్యాయం జరిగితే ఏం చేశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications