ఎన్జీ రంగాను ఓడించిన బాషా, సీట్ బెల్ట్ ధరించి ఉంటే..!
హైదరాబాద్/గుంటూరు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లాల్ జాన్ బాషా స్వయంకృషితో ఎదిగిన నేత. జాతీయ నాయకుడు ఆచార్య ఎన్జీ రంగాను పిన్న వయసులోనే ఓడించిన ఘనత బాషాది. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండేవారు. బాషా 1956 ఆగస్టు 2న జన్మించారు. 1977లో రజియాబేగంతో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఎస్సెస్సీ వరకే చదువుకున్నారు.
ఆటోమొబైల్ విడిభాగాల వ్యాపారం చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో అందులో చేరారు. 1991లో ఆయనకు గుంటూరు లోకసభ టిక్కెట్ వచ్చింది. అప్పుడు ఆయన ఎన్జీ రంగా పైన దాదాపు పదిహేను వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 1996, 1998, 1999 ఎన్నికలలో ఓటమి చవి చూశారు. 2002 నుండి ఆరేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

టిడిపి నేతలు కన్నుమూసినప్పుడు వారి భౌతికకాయాన్ని హైదరాబాదులోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తీసుకు రావడం ఇది మూడోసారి. గతంలో మంత్రి మాధవ రెడ్డి, లోకసభ స్పీకర్ బాలయోగిల భౌతికకాయాలను పార్టీ కార్యాలయానికి తీసుకు వచ్చి నివాళులర్పించారు. ఇప్పుడు బాషా మృతదేహాన్ని తీసుకు వచ్చి నివాళులర్పించారు.
సీటు బెల్ట్ ధరించి ఉంటే...!
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లాల్ జాన్ బాషా సీటు బెల్టు ధరించి ఉంటే తీవ్ర గాయాలతో బయటపడి ఉండేవారంటున్నారు. కారు డ్రైవర్ బెల్టు పెట్టుకోవడం వల్ల స్టీరింగ్ వద్ద ఉన్న ఎయిర్ బెలూన్ తెరుచుకొని ప్రాణాలతో బయటపడగలిగాడు. బాషా కూర్చున్న వైపు సైతం బెలూన్ తెరుచుకున్నప్పటికి ఆయన సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో కారు తలుపు తెరుచుకొని కింద పడిపోవడంతో మృతి చెందారు. బెల్టు ధరిస్తే తీవ్ర గాయాలతోనైనా బయటపడి ఉండేవారంటున్నారు. కాగా, బాషా పాదం కారులోనే చిక్కుకుపోయింది. ఆయన మాత్రం కారు నుండి బయటకు పడ్డారు.












Click it and Unblock the Notifications