ఉరికంబమెక్కినా చివరి కోరిక, వైయస్ కంటే నేనే: జానా

తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా సీమాంధ్రనేతలు ముఖ్యమంత్రితో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మాట్లాడటం పార్టీ ధిక్కారంగా భావించలేమన్నారు. వారి అభిప్రాయాలను మాత్రమే చెబుతున్నట్లుగా పేర్కొన్నా రు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నాలుగున్నరేళ్లుగా రాష్ట్రాన్ని విభజించాలని అధిష్ఠానాన్ని, కేంద్రాన్ని కలిసి చెప్పాం, లేఖలు రాశామని, అయినా ముఖ్యమంత్రి మౌనంగా కూర్చోలేదా? ఉరికంబం ఎక్కేముందు కూడా చివరి కోరిక అడగడంలో తప్పులేదని వ్యాఖ్యానించారు.
దాదాపు ఆరు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నామని, తమ అభిప్రాయం సరైనదేనని అధిష్ఠానం భావించిందని, రాష్ట్రాన్ని ప్రకటించిందని, ఇప్పుడు ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సీమాంధ్ర వారు కోరుతున్నారని, దీనిపై కేంద్రమే నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. అయితే, కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత వ్యక్తిగత అభ్రిపాయాలతో సంబంధం ఉండదని, ప్రభుత్వం దాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ సీమాంధ్రకు నాయకత్వం వహిస్తున్నట్లుందని ఒక పాత్రికేయుడు ప్రశ్నించగా ఎవరు ఎవరికి నాయకత్వం వహించినా, ఎవరూ, ఎవరికీ భయపడి ఉండరని, ఎవరి పాత్ర వారు నిర్వహిస్తారని, ఎవరి హోదాను వారు హుందాగా నిర్వహించాలన్నారు. అంతిమంగా పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠకు విఘాతం కలిగించకూడదన్నారు. సీమాంధ్రలో ఆందోళనల కారణంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కొంత జాప్యం జరగవచ్చేమోగానీ, నిలిచిపోదని ఆయన స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లోపే తెలంగాణ ఏర్పడుతుందని, రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పారు. సీమాంధ్రలో జరుగుతున్న సమ్మెని ప్రభుత్వమే నడిపిస్తోందని తెలంగాణవాదులు చేస్తున్న ఆరోపణలను జానారెడ్డి తోసిపుచ్చారు. ఆ వాదన పూర్తిగా అబద్ధమన్నారు. తెలంగాణకు బీజం వేసింది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కాదని, తానేనని చెప్పారు. వైయస్ కన్నా ముందే తాను తెలంగాణవాదాన్ని లేవనెత్తానని చెప్పుకొచ్చారు.
తెలంగాణ విషయంలో వైయస్ కేవలం పాత్రదారుడే అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బస్సుయాత్ర చేపడితే తప్పేంటని ఆయన ఎదురు ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్య క్షురాలు వైయస్ విజయమ్మ చేపట్టనున్న ఆమరణ దీక్షపై స్పందిస్తూ ప్రజలకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితులు ఏర్పడకుండా అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలన్నాలని కోరారు.












Click it and Unblock the Notifications