సమైక్యం ఒకటే, వారిద్దరే ఒప్పించాలి: సీమాంధ్ర నేతలలు
హైదరాబాద్: రాష్ట్రాన్ని ఒకటిగానే ఉంచాలని ఎకె ఆంటోనీ కమిటీని కోరుదామని, విభజనపై ముందుకే అని చెబితే కమిటీని బహిష్కరిద్దామని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు నిర్ణయించుకున్నారు. అసలు ఆంటోనీ కమిటీ ముందుకు వెళ్లాలా వద్దా? అనే దశ నుంచి ఆంటోనీ కమిటీనే హైదరాబాద్‌కు రప్పించాలనే దాకా... అనేక అంశాలపై వాడివేడిగా చర్చించుకున్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి సుమారు 89 మంది నేతలు సమావేశమయ్యారు.
ఈ నెల 20న ఆంటోనీ కమిటీతో సమావేశం కానున్న నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలపై శనివారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా చర్చించుకున్నారు. అధిష్టానం విభజనకు సానుకూలంగా ఉందని, ప్రాంత సమస్యలపై డిమాండ్ చేద్దామన్న బొత్స సూచనలతో వారు విభేదించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై కొందరు మండిపడ్డారు. ఎవరినీ సంప్రదించకుండా కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాలు తీసుకుంటే ఎలా? విభజనకే కట్టుబడి ఉన్నప్పుడు ఢిల్లీదాకా వెళ్లి ఆంటోనీ కమిటీని కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

మనం సమైక్యవాదానికే కట్టుబడి ఉందామని, ఆంటోనీ కమిటీకి అదే మాట చెబుతామని, కాదని వ్యతిరేకిస్తే కమిటీని బహిష్కరిద్దామని తేల్చి చెప్పారు. ఆంటోనీ కమిటీ సభ్యులు రాష్ట్ర పర్యటనకు రాకుండా ఢిల్లీకి పరిమితం కావడంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలుగా మనం ఢిల్లీకి వెళతాం. మిగిలిన వారు ఎలా వెళతారు? ఎక్కడ ఉంటారు? ఆంటోనీ కమిటీ సభ్యులు సీమాంధ్రలో పర్యటించి, వాస్తవాలు గ్రహించాలన్నారు.
విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని వారు కిరణ్, బొత్సలతో చెప్పారు. ఉద్యమంలో సంయమనం పాటించాలని ప్రజలకు, ఉద్యోగులకు విజ్ఞప్తి చేసేందుకు నిరాకరించారు. వాళ్లనన్నా ఉద్యమించనివ్వాలని మండిపడ్డారు. రైతులు ఆందోళనలకు దిగితే ఎవరూ ఆపలేరని మంత్రి సి రామచంద్రయ్య అన్నారు. ఢిల్లీ పెద్దల్ని ఒప్పించేందుకు మీరిద్దరే చొరవ తీసుకోవాలని కిరణ్, బొత్సలకు సూచించారు.
సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కేబినెట్ నోట్‌ను, అసెంబ్లీ తీర్మానాన్ని ఎమ్మెల్యేలు తిప్పికొట్టాలని ఈ సమావేశంలో పలువురు సూచించారు. "అసెంబ్లీలో తీర్మానం వస్తే దానిని వ్యతిరేకించాలి. ఆ సమయంలో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి. కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన నోట్‌ను వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రులు వారి పదవులకు రాజీనామాలు చేయాలి. పార్లమెంటులో బిల్లు వచ్చినప్పుడు ఎంపీలు అందుకు వ్యతిరేకంగా పదవులకు రాజీనామాలు చేయాలి'' అని నేతలు సూచించారు. ఈ సమయంలో మంత్రి వట్టి వసంత కుమార్ మాట్లాడుతూ... సమైక్య దిశగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు ఎవరి బాధ్యతను వారు సమర్థంగా నిర్వహించాలని కోరారు.












Click it and Unblock the Notifications