విభజన: పద్మవ్యూహంలో చిక్కిన సోనియా గాంధీ

న్యూఢిల్లీ: కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పరిస్థితి. పెనం మీంచి పొయ్యిలోకి పడినట్లయింది. సమైక్య సెగలు ఉధృతంగా తాకుకుండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేని స్థితిలో ఆమె పడ్డారు. యుపిఎ ప్రభుత్వంతో పాటు కాంగ్రెసు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లే.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. ప్రజలు రోడ్ల మీదికి వచ్చారు. మరోవైపు సీమాంధ్ర ప్రభుత్వోద్యోగులు కూడా ఆందోళనలో అడుగుపెట్టారు. వారిని చల్లార్చడం ఎలాగో కాంగ్రెసు అధిష్టానానికి దిక్కు తోచడం లేదు. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నాయకులే కాకుండా సొంత కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నాయకులు కూడా సమైక్యాంధ్ర ఉద్యమానికి ఆజ్యం పోస్తున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు కూడా మడతపేచీ పెడుతున్నారు. సొంత పార్టీ నాయకులనే అదుపు చేయలేని స్థితిలో కాంగ్రెసు అధిష్టానం పడింది.

Sonia Gandhi

ఈ స్థితిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందడుగు వేయడం ఎలాగనేది సంకటపరిస్థితే. ఏర్పాటు చేయబోయే తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్థితిగతులను మార్చడానికి గానీ హైదరాబాద్‌ విషయంలో సీమాంధ్ర నాయకుల డిమాండ్‌కు అనుగుణంగా గానీ నిర్ణయం తీసుకోలేని స్థితి ఉంది. బిల్లు ఆమోదానికి బిజెపి మద్దతు అవసరం పడడమే కాకుండా తెలంగాణ నేతల నుంచి కూడా వ్యతిరేకత ఎదరువుతుందనేది కాంగ్రెసు అధిష్టానానికి తెలుసు. దాంతో పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం, పదేళ్ల పాటు మాత్రమే హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచడం మినహా మరో విధంగా ముందుకు సాగలేని స్థితి ఉంది.

తమ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలను చల్లబరచడానికి వేసిన ఆంటోనీ కమిటీ కూడా ఫలితం సాధించే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెసుకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సమైక్యాన్ని తప్ప మరోదాన్ని అంగీకరించేది లేదని అంటున్నారు. సీమాంధ్రలో పెల్లుబుకే ఆందోళనల గురించి, తమ పార్టీ సీమాంధ్ర నాయకుల నుంచి వచ్చే వ్యతిరేకత గురించి కాంగ్రెసు అధిష్టానం తక్కువగా అంచనా వేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నాయకులు ఆందోళనలను అణచివేయడానికి అవకాశాలున్నాయి. కానీ, సొంత పార్టీలోని వ్యతిరేకతను, ప్రజల ఆందోళనలను ఎలా పరిష్కరించాలనేదే అంతు పట్టకుండా ఉందని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం నుంచి వెనక్కి తగ్గకుండా సీమాంధ్ర నాయకులను, ప్రజలను ఊరడించే మార్గం ఉంది. రాష్ట్ర ఏర్పాటు ఇప్పుడు జరగదని, వచ్చే ఎన్నికల తర్వాత తమకు మెజారిటీ వస్తే చేస్తామని, కానీ తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెసు అధిష్టానం ప్రకటిస్తే గుడ్డిలో మెల్లలా పరిస్థితి చక్కబడవచ్చు. కానీ పార్టీగా కాంగ్రెసు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ఆందోళనలు పెల్లుబుకే అవకాశం ఉంది. రెండోసారి కాంగ్రెసు చేతిలో మోసపోయామనే భావన తెలంగాణ ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు అధిష్టానం ఆశించిన ఫలితాలు సున్నా కావచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి, బిజెపి తెలంగాణ ప్రాంతంలో, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు సీమాంధ్రలో విపరీతంగా పుంజుకునే అవకాశాలున్నాయి. కాంగ్రెసు వెనక్కి తగ్గితే ఆ క్రెడిట్ మొత్తం వైయస్సార్ కాంగ్రెసుకు పోతుంది. దాంతో రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెసు ఆశలు వదులుకోవాల్సి వస్తుంది.

కక్కలేని మింగలేని స్థితిలో పడిన కాంగ్రెసు అధిష్టానం సమస్య నుంచి గట్టెక్కి తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఏ విధంగా ఆమోదింపజేసుకుంటనేదే మిగిలి ఉంది. ఆ పార్టీ మరో గత్యంతరం లేని పద్మవ్యూహంలో చిక్కుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+