ముంబై గ్యాంగ్ రేప్: ఫొటో జర్నలిస్టుల నిరసన
హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న మహిళా ఫొటో జర్నలిస్టుపై ముంబైలోని శక్తి మిల్స్ ఆవరణలో జరిగిన సామూహిక అత్యాచారాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల సంఘం (ఎపిపిజెఎ) ఆధ్వరంలో హైదరాబాదులో శుక్రవారం నిరసన ర్యాలీ జరిగింది. ఫొటో జర్నలిస్టుపై అత్యాచారాన్ని సంఘం ఖండించింది.
హైదరాబాదులోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో ఫొటో జర్నలిస్టులతో పాటు ఇతర జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు. విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు, ముఖ్యంగా మహిళా జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలదేనని ఎపిపిజెఎ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి అన్నారు.

కాగా, ముంబైలోని ఫొటో జర్నలిస్టుల సంఘాలు మౌన ప్రదర్శన నిర్వహించాయి. మహిళా జర్నలిస్టుపై అత్యాచార ఘటన పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అత్యాచారం కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఒకరిని అరెస్టు చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.
గురువారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా తన సహోద్యోగితో సహా శక్తి మిల్స్‌కు వెళ్లిన మహిళా ఫొటో జర్నలిస్టులపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.

బాధితురాలికి శస్త్రచికిత్స
ఇదిలావుంటే, తీవ్రంగా గాయపడిన బాధితురాలికి గురువారం జస్లోక్ అస్పత్రిలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆమె ఇప్పటికీ తీవ్రమైన మానసిక ఆందోళనలోనే ఉందని వైద్యులు చెప్పారు. ఆమె పరిస్థితి కాస్తా మెరుగుపడిందని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications