సమాధానం చెప్తారా?: విజయమ్మకు టిడిపి 17 ప్రశ్నలు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మకు తెలుగుదేశం పార్టీ శుక్రవారం పదిహేడు ప్రశ్నలను సంధించింది. విభజన నేపథ్యంలో ఆ పార్టీ తెలుగుదేశం పార్టీని, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసుకోవడంతో వారు పదిహేడు ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ విడుదల చేశారు.
''ఉప ఎన్నికల సమయంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు వెలిబుచ్చిన మీరు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు. విభజనపై సిడబ్ల్యూసి ప్రకటనకు ముందు వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిల మధ్య అంతర్గత చర్చలు జరగడం వాస్తవం కాదా? జగన్ బెయిల్ కోసమే రాబర్ట్ వాద్రా అవినీతిపై మీ పార్టీ మౌనం వహించడం నిజం కాదా?

తెలంగాణకు బీజం వేసింది వైయస్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్, మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పిన విషయంలో వాస్తవం లేదా? రాయలసీమ పోరాట సమితి పేరుతో సీమ ప్రజలను, ప్రత్యేక రాష్ట్రం పేరుతో తెలంగాణ ప్రజలను తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైకి ఉసిగొల్పింది వైయస్ కాదా?
జగన్ కేసులో సిబిఐ విచారణ ఎందుకు నెమ్మదించింది?, కాంగ్రెసులో విలీనంపై అంతర్గత చర్చల సారాంశమేమిటి?, విభజన విషయంలో అసలు దోషి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని పల్లెత్తు మాట ఎందుకు అనడం లేదు?, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని సభలో పోరాడవద్దని సోనియా చెప్పారా?" అని తదితర ప్రశ్నలతో కూడిన లేఖను టిడిపి సీమాంధ్ర ఎమ్మెల్యేలు విడుదల చేశారు.












Click it and Unblock the Notifications