పాడు చేశారు, వారికి జీవిత ఖైదు పడాలి: ముంబై విక్టిమ్
ముంబై: తనపై జరిగిన భౌతిక దాడి దేశంలో మరో మహిళకు జరగకూడదని ముంబై బాధితురాలు అన్నది. తనపై అత్యాచారానికి పాల్పడినవారికి జీవిత ఖైదు పడాలని ఆ ఫొటో జర్నలిస్టు అభిప్రాయపడింది. వారు తన జీవితాన్ని పాడు చేశారని, వారికి కఠిన శిక్ష పడాలని ఆమె అన్నది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తన తల్లితో ఆ మాటలు అన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
తనకు స్పృహ రాగానే అన్న తొలి మాటలు అవి. ఓ ఆంగ్లపత్రికకు పనిచేస్తున్న మహిళా ఫొటో జర్నలిస్టుపై గురువారం సాయంత్రం ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. తనపై అత్యాచారం జరిగిన తర్వాత 12 గంటలకు ఆమె కాస్తా ధైర్యం కూడదీసుకుంది. బాధితురాలు ధైర్యం ప్రదర్శిస్తోందని కుటుంబ సభ్యులు అంటున్నారు.

తాను తన అసైన్‌మెంట్‌ను పూర్తి చేయాలని అనుకుంటోందని, అది భవిష్యత్తుకు అవసరమని భావిస్తోందని, తాను కోలుకున్న తర్వాత తిరిగి పనికి వెళ్లాలని అనుకుంటోందని అంటున్నారు. గత మూడున్నర నెలలుగా ఆమె ఆ పత్రికలో ఇంటర్నీగా పనిచేస్తోంది.
గురువారం రాత్రంతా బాధితురాలు తీవ్ర మానసిక క్షోభను, శారీరక బాధను అనుభవించినట్లు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం గానీ ఆమె ఓ కప్ చాయ్ తాగలేకపోయిందని చెబుతున్నారు. టీవీలో వస్తున్న వార్తలు ఆమెలో ధైర్యాన్ని పెంచుతున్నట్లు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం కొద్ది సేపు టీవీలో వార్తలు చూసిందని సమాచారం.












Click it and Unblock the Notifications