జగన్ దీక్ష: అధికారులు కలిసే ఛాన్స్, ఎపిఎన్జీవో ఉద్రిక్తం
హైదరాబాద్: ఆస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన దీక్షను కారాగారంలో కొనసాగిస్తున్నారు. ఉదయం ఫలహారం తీసుకోని జగన్ మధ్యాహ్నం భోజనం చేయలేదు. రాత్రి కూడా భోజనం తీసుకోకుంటే జైలు అధికారులు అతనిని కలిసే అవకాశాలు ఉన్నాయి.
తాను దీక్ష చేస్తున్నట్లు వైయస్ జగన్ జైలు అధికారులకు సమాచారం అందించలేదు. ఈ విషయాన్ని జైలు అధికారులు కూడా తెలిపారు. జగన్ దీక్ష పైన తమకు ఎలాంటి సమాచారం లేదని, అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే స్పందించే వాళ్లమని, 24 గంటలు దాటితే గానీ దీక్షపై స్పందించలేమని చెప్పారు. అయితే, జగన్ ఉదయం నుండి ఏమీ తినకుండా ఉండటంతో వారు అతనిని కలిసి విషయం కనుక్కునే అవకాశం ఉంది.

విభజనలో సమన్యాయం కావాలని లేదంటే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ గుంటూరులో ఆమరణ దీక్ష ప్రారంభించగా.. రెండు రోజుల క్రితం పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేశారు. దీంతో జగన్ జైలులో దీక్ష చేస్తున్నారు.
జగన్ దీక్ష డ్రామా: గాలి
జగన్ దీక్ష ఓ డ్రామా అని టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. విభజన వాదానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డే కారణమన్నారు. ప్రజలను మోసం చేసేందుకు తల్లీ, కొడుకులు దీక్షల పేరుతో నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయన్నారు. జగన్‌ను తీహార్ జైలుకు తరలించాలన్నారు. జగన్ కేసులో విచారణ ఎందుకు నెమ్మదించిందని ప్రశ్నించారు.
ఆబిడ్స్ ఎపిఎన్జీవో హోం వద్ద ఉద్రిక్తత
రాష్ట్ర రాజధాని హైదరాబాదు అబిడ్స్‌లో గల ఎపిఎన్జీవో కార్యాలయం వద్ద ఆదివారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెప్టెంబర్ 7వ తేదిన సమైక్యాంధ్ర సభ పైన ఎపిఎన్జీవో లాయర్లు సమావేశమయ్యారు. ఈ సమయంలో తెలంగాణ లాయర్లు ఎపిఎన్జీవో కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చారు. ఇరువర్గాలు జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. తోపులాట జరిగింది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల తెలంగాణ న్యాయవాదులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.
కాగా, విభజన జరగకుముందే తమ పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ వచ్చాక ఎలా ఉంటుందని సీమాంధ్ర ఉద్యోగులు ప్రశ్నించారు. స్వతంత్ర భారత దేశంలో తమ వాదన వినిపించే హక్కు లేదా అన్నారు. మా సమావేశం అడ్డుకోవడం సరికాదన్నారు. తమ ఆఫీసుపై తెలంగాణ లాయర్లు దౌర్జన్యం చేశారన్నారు. సంఘ విద్రోహ శక్తులను తమ పైకి ఎగదోస్తున్నారని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఆరోపించారు. వారున్నది మూడున్నర కోట్లయితే తాము ఆరున్నర కోట్ల మందిమి ఉన్నామన్నారు. ఇలా అయితే జీవిత కాలంలో తెలంగాణ రాదన్నారు.
పల్లె ఉమ దీక్ష భగ్నం
సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురం జిల్లాలో దీక్ష చేస్తున్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి పల్లె ఉమ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేశారు. ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమైక్యాంధ్ర ఉద్యమంలో విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకు తాము పోరాడుతామని, సీమాంధ్ర ఉద్యమాన్ని అధిష్టానం పరిశీలిస్తోందని చెప్పారు.












Click it and Unblock the Notifications