దీక్షలో జగన్, చర్యలు తీసుకోండి: కోర్టుకు జైలు వర్గాలు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షను చంచల్ గూడ జైలు అధికారులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) న్యాయస్థానం దృష్టికి బుధవారం తీసుకు వెళ్లారు. జైల్లో జగన్ దీక్ష చేస్తున్నారని, తగు చర్యలు తీసుకోవాలని జైలు అధికారులు సిబిఐ కోర్టును కోరారు.
నాలుగో రోజు జగన్ దీక్ష
రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ చంచల్ గూడ జైలులో వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్ష బుధవారం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ రోజు ఉదయం వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బిపి, షుగర్ లెవల్, పల్స్ రేటు పరీక్షలు జరిపారు. సాయంత్రం మరోసారి పరీక్షలు జరిపి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు.

తీహార్‌కు పంపించాలి: ఎర్రబెల్లి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కంట్రోల్ చేసి, జగన్‌ను వేరే జైలుకు తరలిస్తే సమైక్యాంధ్ర ఉద్యమం ఆగుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు వరంగల్ జిల్లాలో అన్నారు. జగన్‌ను తీహార్ జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెసు రెండు ప్రాంతాల్లో నాటకాలు ఆడిస్తోందని, విజయమ్మ దీక్ష, ఢిల్లీ పర్యటన అందులో భాగమేనని ఆరోపించారు. పార్లమెంటులో బిల్లు పెడితే టిడిపి మద్దతిస్తుందన్నారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు.












Click it and Unblock the Notifications