బిజెపి తెలంగాణకే కానీ, తొందరపాటన్నారు: అశోక్‌బాబు
న్యూఢిల్లీ: ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తాము చిన్న రాష్ట్రాలకే కట్టుబడి ఉన్నామని తమతో చెప్పిందని అయితే, తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ప్రకటనను మాత్రం తప్పుపట్టిందని ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు బుధవారం అన్నారు. ఎపిఎన్జీవోలు ప్రతిపక్ష నేతలను కలిశారు. వారు కలిసిన వారిలో సుష్మా స్వరాజ్, లాల్ కృష్ణ అద్వానీలు ఉన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
తాము చిన్న రాష్ట్రాలకే కట్టుబడి ఉన్నామని, తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని బిజెపి చెప్పిందని అయితే, ప్రకటన తొందరపాటు నిర్ణయమని చెప్పారన్నారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తున్నప్పటికీ సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరగకూడదని అడుగుతామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎంతగా మద్దతిస్తున్నామో, సీమాంధ్రులకు న్యాయానికి అంతే మద్దతిస్తామని చెప్పారన్నారు.

సెప్టెంబర్ 2వ తేది నుండి విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారన్నారు. హైదరాబాదులో తాము ఎట్టి పరిస్థితుల్లో సభ నిర్వహించి తీరుతామన్నారు. వచ్చే నెల 7వ తేదిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ పేరుతో సభ నిర్వహిస్తామన్నారు. స్వతంత్ర ఉద్యమం తర్వాత సీమాంధ్రలో ఇంతటి ఉద్యమం లేదన్నారు. తెలంగాణవాదనలో పస లేదన్నారు. తమ సభకు ఏ ప్రాంతం వారైనా రావొచ్చునన్నారు.
విభజన వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పవద్దన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకంగా సభ పెట్టడం లేదన్నారు. హైదరాబాదు పైన అందరికీ సమాన హక్కులున్నాయన్నారు. ప్రభుత్వం తమకు అనుమతి ఇవ్వకపోతే చట్టపరంగా ఎదుర్కొని సభను నిర్వహిస్తామన్నారు. సభలో విభజన ద్వారా కలిగే నష్టాలను ప్రజలకు చెబుతామన్నారు.












Click it and Unblock the Notifications