ఊసరవెల్లుల ప్రెసిడెంట్: పొంగులేటి, బాబుకి సమైక్య సెగ
గుంటూరు/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఊసరవెల్లుల అసోసియేషన్‌కు అధ్యక్షుడు అని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సోమవారం ఎద్దేవా చేశారు. విభజనపై బాబు యూ టర్న్ తీసుకోవడం దివాళాకోరుతనమన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విశ్వసనీయతకు మారుపేరు అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మాట తప్పడం, మడమ తిప్పడం మామూలే అన్నారు.
బాబుకు సమైక్య సెగ
గుంటూరు జిల్లాలో తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు సోమవారం సమైక్య సెగ తగిలింది. బాబు యాత్రలో కొందరు విద్యార్థులు సమైక్య ప్లకార్డులు ప్రదర్శించారు. జై సమైక్యాంధ్ర అని నినాదాలు చేశారు.

కాగా, అంతకుముందు యాత్ర రెండో రోజు ప్రారంభం సమయంలో చంద్రబాబు మాట్లాడారు. పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ఎంపీల పోరాటం బాగుందన్నారు. ఇరు సభల్లో టిడిపి ఎంపీలు న్యాయం కోసం నిరసనలు వ్యక్తం చేస్తున్నారని, కాంగ్రెసు పార్టీ వారు ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తెలుగు జాతిని టిడిపి మాత్రమే కాపాడగలదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు.
సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు కేంద్రానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎపిలో అభివృద్ధి అంతా టిడిపి హయాంలోనే జరిగిందన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న వారంతా చంచల్‌గూడ జైలులో కూర్చున్నారని, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఓ ముద్దపప్పు అని, ఆయనను ప్రధాని చేసేందుకే ఈ కుట్ర అన్నారు. కాగా, ఉదయం గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల నుంచి బాబు యాత్రను ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications