ఏమైనా చేస్తారా?: జగన్‌ను ఏకిపారేసిన హరీష్ రావు
హైదరాబాద్: సమైక్యవాదం వినిపిస్తున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యులు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ పార్టీ అవినీతి, అబద్దాల పునాదుల మీద పుట్టిందని ఆరోపించారు. విద్వేషాలను రెచ్చగొట్టి పదవులు పొందటం వారికి అలవాటే అన్నారు. తెలంగాణ వస్తే నీళ్లు రావని, ఉద్యోగాలు ఉండవని రెచ్చగొట్టడం సరికాదన్నారు.
అసలు భయం వారికే ఉందన్నారు. వారి సొంత భయాన్ని ప్రజల భయంగా చెబుతున్నారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే బయ్యారం గనులు దక్కయని, భూములు కొల్లగొట్టే అవకాశముండదని, జగన్‌కు కుర్చీ దక్కదనే భయం వారిలో ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రజల్లో అనుమానాలు, అపోహలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తోందన్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయే నాటి వరకు జగన్ కడప ఎంపీగా ఉండి బెంగళూరులో వ్యాపారం చేస్తే ఎవరైనా ఏమైనా అన్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రం వస్తే మీ దోపిడీకి, మీ కుర్చీకి అవకాశముండదేమో కానీ, ప్రజలకు ఎలాంటి నష్టం లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఎప్పుడు ఎవరు నమ్మలేదన్నారు. జగన్ నిజ స్వరూపం బయటపడ్డాక అందులో చేరిన కొందరు కూడా ఇప్పుడు గుడ్ బై చెప్పారని, అదే చేతులతో పార్టీ గద్దెలు కూల్చేస్తున్నారన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే, వ్యక్తిగత స్వార్థం కోసమే ప్రజలను రెచ్చగొట్టవద్దన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి, విజయమ్మ, వైయస్ జగన్, షర్మిల.. ఇలా ఆ కుటుంబానికి చెందిన అందరు ఒక్కో సమయంలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని, ఇప్పుడు మాత్రం తాము మొదటి నుండి సమైక్యవాదులమే అని చెబుతున్నారని విమర్శించారు. కావాలనుకుంటే మీరు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన సిడిలను పంపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
ఓట్ల కోసం ఎంతకైనా దిగజారే కుటుంబం వైయస్ కుటుంబం అన్నారు. తెలంగాణలో ఆ పార్టీ కనుమరుగైందని, ఇంకెవరు మోసం చేసినా అదే గతి పడుతుందన్నారు. జగన్ పార్టీ మాట తప్పని, మడమ తిప్పని పార్టీ కాదని, మాట తప్పే, మడమ తిప్పే పార్టీ అన్నారు. జగన్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా పలు సందర్భాలలో మాట్లాడింది, అవి మీకు గుర్తుకు లేకుంటే వాటిని పంపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
అధికారం కోసం ఆ కుటుంబం ఏమైనా చేస్తుందన్నారు. నాడు హైదరాబాదులో వైయస్ మతకల్లోహాలు సృష్టించారని, సొంత పార్టీ నేత పైన చెప్పులు వేయించారని ఆరోపించారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని, ఇప్పుడు ప్రకటించాక సమైక్యమని ఎందుకంటున్నారని ప్రశ్నించారు. జగన్ పార్టీకి అధికారమే లక్ష్యం, పదవే ప్రాణమని అన్నారు. పార్టీ పుట్టినప్పటి నుండి ఆ పార్టీ ఏం అవలంభిస్తుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు.
నాడు వైయస్ 41 మంది ఎమ్మెల్యేలను తెలంగాణ కోసం ఢిల్లీకి పంపించారని, 2004లో తెరాసతో పొత్తు పెట్టుకున్నారని, 2009లో ఎన్నికలకు ముందు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అభ్యంతరం లేదని, కాంగ్రెసు పార్టీ దానికి సూత్రప్రాయంగా కట్టుబడి ఉందని చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆమరణ దీక్ష తర్వాత కేంద్రం తెలంగాణ ప్రకటిస్తే జగన్ పార్లమెంటులో సమైక్య ప్లకార్డులు పట్టుకున్నారని, పార్టీ పెట్టాక దాని గురించి అడిగితే అది కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడని చెప్పారన్నారు.
తాము తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తున్నామని, తాము తెలంగాణ ఇచ్చే ఆపే స్థితిలో లేమని, దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని జగన్ పార్టీ చెప్పిందన్నారు. ఇప్పుడు నిర్ణయమొచ్చాక దీక్షలు, ధర్నాలు ఎందుకన్నారు. ప్లీనరీలో ఇచ్చిన హామీ, పరకాల ఉప ఎన్నికల్లో విజయమ్మ, షర్మిలలు చెప్పిన మాటలు అప్పుడే మర్చిపోయారా అన్నారు. చేతిలో మత గ్రంథం పట్టుకుంటున్నారని, అది పట్టుకొని కూడా అబద్దాలు ఆడితే ఎలా అని ప్రశ్నించారు.
చేతిలో బైబిల్ పట్టుకొని మాట్లాడిన మాటలకు కూడా కట్టుబడరా అని ప్రశ్నించారు. చివరకు భగవంతుడిని కూడా మోసం చేస్తారా అన్నారు. నాడు వైయస్ హైదరాబాదులో మతకల్లోహాలు సృష్టిస్తే నేడు ఆయన కూతురు షర్మిల హైదరాబాదును పాకిస్తాన్‌తో పోల్చడం దారుణమన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నైతిక విలువలు లేకుండా మాట్లాడుతోందన్నారు. వైయస్ నుండి షర్మిల వరకు అధికార దాహమే అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒత్తిడిలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications