వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు వ్యూహంలో బాబు: 'చంద్ర'వ్యూహంలో చిరు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు అధిష్టానం వ్యూహంలో చిక్కుకున్నట్లే కనిపిస్తున్నారు. తెలంగాణ వైఖరిని దాదాపుగా ఆయన మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. పూర్తిగా సమైక్యవాదాన్ని భుజాన వేసుకోవడం ద్వారా చంద్రబాబు కాంగ్రెసు పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. తొలుత రాష్ట్ర విభజనను అంగీకరించిన చంద్రబాబు ఒక్కసారిగా తన మనసు మార్చుకుని సీమాంధ్రలో బస్సు యాత్రకు సిద్ధపడ్డారు.

తెలంగాణకు అనుకూలంగా తాను ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో చంద్రబాబు సీమాంధ్రలో వివరిస్తారని, తమ పార్టీని దెబ్బ తీయడానికి విభజన వ్యూహాన్ని కాంగ్రెసు ఎలా పన్నిందో చెబుతారని భావించారు. కానీ, ఆయన సీమాంధ్ర ప్రజలకు నచ్చజెప్పడానికి బదులు సమైక్యవాదం వైపు తాను ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలను ఆయన దుయ్యబడుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డే రాష్ట్ర విభజనకు కారణమని ఆయన విమర్శిస్తున్నారు.

చంద్రబాబు సమైక్యవాదాన్ని వినిపించడం వల్ల తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై ఈ ప్రాంత నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రం నుంచి కనీసం పది నుంచి పదిహేను సీట్లను గెలుచుకునే ఎత్తుగడతో కాంగ్రెసు అధిష్టానం వ్యవహరిస్తోంది. కర్ణాటకలో అత్యధిక సీట్లను గెలుచుకోగలమనే ధీమాతో ఉంది. దీంతో తెలంగాణలో పూర్తి స్థాయిలో లోకసభ ఎన్నికల్లో ఆధిపత్యం సాధించాలనేది కాంగ్రెసు అధిష్టానం వ్యూహంగా చెబుతున్నారు.

Chiranjeevi and Chandrababu Naidu

విభజనకు అంగీరిస్తూ చంద్రబాబు సీమాంధ్రకు ప్యాకేజీలను పెద్ద యెత్తున రాబట్టడానికి ప్రయత్నిస్తే తెలుగుదేశం పార్టీ బలంగా ఉండేదనే అభిప్రాయం ఉంది. చంద్రబాబు సీమాంధ్రలో మాట్లాడుతున్న తీరు వల్ల తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో తీవ్రంగా దెబ్బ తినే ప్రమాదం ఉందనే అంచనాలు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కాంగ్రెసు పార్టీలో విలీనమైనా అవుతుంది, లేదంటే ఎన్నికల పొత్తయినా పెట్టుకుంది. ఈ స్థితిలో తెలంగాణలోని 17 లోకసభ స్థానాల్లో కనీసం 14 సీట్లనైనా గెలుచుకునే విధంగా చంద్రబాబును ఉసిగొలిపినట్లు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా తెలంగాణలో అత్యధిక స్థానాలు తమ పార్టీ చేజక్కించుకుంటుందనే విశ్వాసంతో కాంగ్రెసు అధిష్టానం ఉంది.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటే కాంగ్రెసుకు ఇబ్బందికరమే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పూర్తిగా తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడానికి చంద్రబాబు సమైక్యవాదాన్ని మీద వేసుకున్నారనే ప్రచారం ఉంది. తద్వారా కాంగ్రెసు పార్టీ అధిష్టానం సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు పోటీ పెట్టిందని, తెలంగాణలో తనకు పోటీ లేకుండా చూసుకుంటోందని, సీమాంధ్రలో ఆ రెండు పార్టీలు పోటీ పడడం వల్ల తమ పార్టీ ఏదో మేరకు ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే, కేంద్ర మంత్రి చిరంజీవి చంద్రబాబు విసిరిన వ్యూహంలో చిక్కున్నట్లు కనిపిస్తున్నారు. చిరంజీవి మాత్రమే కాకుండా ఇతర సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు కూడా అందులో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించిన సీమాంధ్ర నాయకులు కూడా మాట మారుస్తున్నారు. మొదట్లో అంగీకరించడానికి సిద్ధపడిన నాయకులు కూడా సీమాంధ్రలో సమైక్య ఉద్యమాన్ని, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల వైఖరులను గమనించి వారు తమ అభిప్రాయాలను మార్చుకున్నట్లు చెబుతున్నారు.

సమైక్యవాదం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు అంటున్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే విభజనకు అంగీకరిస్తామని అంటూ వచ్చిన చిరంజీవి తన వైఖరిని మార్చుకున్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే తన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకుని, సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారు. కాంగ్రెసులోని సీమాంధ్ర అతివాదులు కొత్త పార్టీని పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను ఎదుర్కోవడానికి ఆ కొత్త పార్టీ ఏ మేరకు రూపు దిద్దుకుంటుందో చూడాలి. ఈ వ్యవహారంలో కాంగ్రెసు లాభపడినా ఆశ్చర్యం లేదు.

English summary
According to political analysts - in a strategy of Congress high command strategy Telugudesam party president Nara Chandrababu Naidu has takenup united Andhra slogan in Seemandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X