మీకు మెలోడీ చాక్లెట్లు కావాల్సొచ్చాయా?
దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ పెరిగాయి. ఈ రెండు వారాల వ్యవధిలో వీటి రేట్లు పెరగడం ఇది నాలుగోసారి. దీని దెబ్బకు దేశవ్యాప్తంగా పెట్రోల్ లీటర్ ధర 100 రూపాయలను దాటేసింది. పెంచిన రేట్లు ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. లీటర్, డీజిల్ పై లీటర్ కు ఏకంగా రూ. 2.61 పైసలు, డీజిల్ పై రూ. 2.71 పైసల మేర పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఇది ఇక్కడితో ఆగకపోవచ్చు.
దేశంలో పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా విమర్శించారు. దేశ ఆస్తులను ప్రభుత్వం తన మిత్రులకు విక్రయిస్తోందని ఆరోపించారు. ఈ చర్యలతో దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని, సంపద ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. దేశంలోని ప్రతి ఆస్తిని కేంద్రం తన మిత్రులకు విక్రయిస్తోందని, ఈ పరిస్థితుల్లో దేశం ప్రగతి సాధిస్తుందా? దేశం సంపన్నమవుతుందా? అని నిలదీశారు.

అందరినీ సుసంపన్నం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వమే పేదలను మరింత పేదలుగా, ధనికులను మరింత ధనికులుగా మారుస్తోందని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అనుసరిస్తోన్న అసలు సిసలు విధానమే ఇది అని ఎద్దేవా చేశారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్ అనే అభివృద్ధి మంత్రం వెనుక అసలు గుట్టు ఇదేనని చురకలు అంటించారు. ప్రభుత్వం ఎవరి సలహాలనూ తీసుకోదని, వారి సిద్ధాంతం వల్ల అహంకారం పెరిగిందని ఖర్గే విమర్శించారు.
తాము ఏదైనా చేయగలమని బీజేపీ భావిస్తోందని, పార్లమెంట్ లో ఎక్కువ సీట్లు గెలిచినంత మాత్రాన దేశానికి సంక్షేమం కలగదని ఆయన స్పష్టం చేశారు. సరైన విధానాలతో పేదల కోసం పనిచేస్తేనే మంచి పేరు వస్తుందని, ధరలు పెంచి, ఉద్యోగాలు తగ్గించడం వల్ల రాదని హితవు పలికారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ప్రజలు ఒక పూట భోజనం మానాలని విజ్ఞప్తి చేసి, ఆయనే ఉదాహరణగా నిలిచారని తెలిపారు.
ఒకవైపు ప్రజలకు బంగారం కొనొద్దని చెప్పిన ప్రధాని మోదీ పొదుపు పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. అలాంటి సలహాలు ఇస్తోన్న మోదీ అయిదు దేశాల పర్యటన ఎలా చేశారని ఖర్గే తప్పుబట్టారు. "అక్కడకు వెళ్లి మీరు సాధించింది ఏంటి? ఆయన ఇటలీ ప్రధానమంత్రికి 'మెలోడీ' చాక్లెట్లు బహుమతిగా ఇచ్చారు. 'పార్లే' కంపెనీని ప్రచారం చేయడానికి ఇటలీకి వెళ్లారా.." అని ఖర్గే పేర్కొన్నారు. పార్లే ఉత్పత్తులనే తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటని ఖర్గే ప్రశ్నించారు.
అముల్, కర్ణాటకకు చెందిన నందిని, మదర్ డెయిరీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉత్పత్తులను ఎందుకు తీసుకెళ్లలేదని ఆయన నిలదీశారు. ప్రధాని హోదాలో ఉంటూ ఇలాంటి పనులు చేయకూడదని, మన దేశ ప్రధానమంత్రి హోదా చాక్లెట్లను ప్రచారం చేయడానికి కాదని ఖర్గే స్పష్టం చేశారు. ప్రజలు విదేశాలకు వెళ్లవద్దని చెప్పే ప్రధాని, స్వయంగా వివిధ దేశాల్లో పర్యటిస్తూ ఎంజాయ్ చేస్తోన్నారని ఖర్గే విమర్శించారు.












Click it and Unblock the Notifications