కాంగ్రెసులోకి కొండా సురేఖ: జగన్ చేరుతారో, లేదో
న్యూఢిల్లీ: మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి సొంత గూటికి చేరుకున్నారు. కొండా దంపతులు బుధవారం సాయంత్రం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెసు పార్టీలో చేరారు. వారితో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన కెకె మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెసు పార్టీలో చేరారు. కండువా కప్పి వారిని దిగ్విజయ్ సింగ్ పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు తీసుకున్న వైఖరిని కొండా సురేఖతో పాటు కెకె మహేందర్ రెడ్డి తప్పు పట్టారు. కాంగ్రెసు పార్టీ తమ పుట్టిల్లని, మరింత మంది కాంగ్రెసులో చేరుతారని కొండా సురేఖ అన్నారు. సమన్యాయంతో పేరుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్య రాగం అందుకోవడం వల్లనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు ఆమె తెలిపారు. కార్యకర్తల కోరిక మేరకు, తెలంగాణ ప్రజల మనోభావాల మేరకు తాము కాంగ్రెసులో చేరినట్లు తెలిపారు.

రాష్ట్ర విభజనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ యూటర్న్‌ను ఆమోదించలేమని, తమకు నష్టం జరిగినందు వల్లనే తాము బయటకు వచ్చామని ఆమె చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీలో చేరుతారో, లేదో తనకు తెలియదని సురేఖ అన్నారు. కాంగ్రెసు తమకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ అని ఆమె చెప్పుకున్నారు. ఇంకా రాష్ట్రం విడిపోలేదని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రాంత ప్రజల మనోభావాలను చెబుతున్నారని, దాంతో వివాదం లేదని ఆమె అన్నారు.
వరంగల్‌లో సభ ఏర్పాటు చేస్తే తాను వస్తానని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు ఆమె తెలిపారు. తెలంగాణలో కాంగ్రెసును అధికారంలోకి తేవడానికి తాము శాయశక్తులా కృషి చేస్తామని సురేఖ చెప్పారు. సోనియా నాయకత్వంలో తెలంగాణ రావడాన్ని హర్షిస్తున్నట్లు సురేఖ చెప్పారు. విలువలకు కట్టుబడి ఆనాడు త్యాగం చేశామని, విలువలకు కట్టుబడే ఇప్పుడు కాంగ్రెసులోకి వచ్చామని ఆమె చెప్పారు. పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సమక్షంలో తాము కాంగ్రెసులో చేరాల్సిందని, అయితే ఆరోగ్యం బాగా లేకపోవడంతో డిఎస్ రాలేకపోయారని ఆమె చెప్పారు.
తెలంగాణ బిడ్డలుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ వ్యతిరేక వైఖరిని తాము జీర్ణించుకోలేకపోయినట్లు కెకె మహేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఇచ్చే శక్తి లేదు, ఆపే శక్తి లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆనాడు చెప్పారని, తెలంగాణ అమరవీరులకు నివాళులు కూడా ఆర్పంచారని, దాంతో తెలంగాణకు వ్యతిరేకంగా పార్టీ వ్యవహరించబోదని తాము అనుకున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications