శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్: పది మందిపై లైంగిక దాడి
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శక్తిమిల్స్‌లో ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు మహిళలపై లైంగిక దాడికి పాల్పడడమే పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గత ఐదారు నెలల కాలంలో పది మంది మహిళలపై వారు లైంగిక దాడికి పాల్పడినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నలుగురు మహిళలపై వారు అత్యాచారానికి పాల్పడినట్లు ఇంతవరకు వార్తలు వచ్చాయి.
ఓ సామూహిక అత్యాచార బాధితురాలు బయటకు రావడంతో ఆ నిందితుల పాలిట ఐదుగురు మహిళలు పడినట్లు భావించారు. అయితే, కస్టడీలో ఉన్న నిందితులు భిన్నమైన తేదీలను, వివరాలను చెబుతున్నారని, ఆ సమాచారాన్నంతా క్రోడీకరిస్తే వారు పది మంది మహిళలపై అత్యాచారానికి దిగి ఉంటారనేది అర్థమవుతోందని దర్యాప్తు అధికారి ఒకరు చెప్పినట్లు జాతీయ మీడియాలో బుధవారం వార్తలు వచ్చాయి.

ప్రైవసీ కోసం శక్తి మిల్స్ ఆవరణలోకి వచ్చిన జంటను చూసి అమ్మాయిపై వారు అత్యాచారం చేశారని, ఆ తర్వాత ఓ చెత్త ఏరుకునే మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారని, ఆ తర్వాత ఓ సెక్స్ వర్కర్‌ను తెచ్చుకుని ఆమెను ఉపయోగించుకుని డబ్బులు ఇవ్వకుండా తరిమేశారని, ఆ తర్వాత ఫొటో జర్నలిస్టుపై అత్యాచారానికి పాల్పడ్డారని తొలి దశ విచారణలో తెలిసింది.
మరో ఆరుగురు మహిళలపై కూడా వారు అత్యాచారానికి పాల్పడినట్లు తాజాగా తెలిసింది. ఇళ్లకు చేరుకోవడానికి ట్రాక్స్ దాటే మహిళలను నిందితులు లక్ష్యంగా చేసుకున్నట్లు విచారణలో తేలింది. దాదాపు అన్ని లైంగిక దాడుల్లోనూ పాల్గొన్న సలీం అన్సారీ (27) వారి మొదటి దాడి మార్చిలో జరిగినట్లు చెప్పాడని దర్యాప్తు అధికారులు అంటున్నారు.
పోలీసుల మాదిరిగా, సిఐడి అధికారుల మాదిరిగా నటిస్తూ ట్రాక్స్ దాటే మహిళలను బెదిరించి శక్తి మిల్స్ ఆవరణలోకి తీసుకుని వచ్చి అత్యాచారం చేస్తూ వచ్చారని అంటున్నారు. నిందితులు బాధితులను దోపిడీ చేసేవారు కాదు. ఫోన్లను గానీ టాబ్లెట్లను గానీ తీసుకునేవారు కాదు. వాటి ద్వారా పట్టుబడుతామనే ఉద్దేశంతో బాధితుల వస్తువులను దొంగిలించేవారు కాదని అంటున్నారు.












Click it and Unblock the Notifications