ఇటలీ, ఇడుపులపాయ మైత్రితో కుట్ర: చంద్రబాబు
గుంటూరు: ఇటలీ, ఇడుపులపాయ మైత్రి కుదరడంతోనే తెలుగుజాతిపై కుట్ర జరిగిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌లను ఉద్దేశించి ఆయన ఇటలీ, ఇడుపులపాయ అని అన్నారు. గుంటూరు జిల్లాలో ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న చంద్రబాబు గురువారంనాడు చలపతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముప్పయి ఏళ్లుగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, భవిష్యత్తులో కాంగ్రెస్‌ను భూస్తాపితం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ సొంత నిర్ణయంలా తీసుకుందని మండిపడ్డారు. తెలంగాణ సమస్య పరిష్కరించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విలీనం కోసం కాంగ్రెసు రాష్ట్రంలో మరో సమస్యను సృష్టించిందని ఆయన అన్నారు. ఈ విషయంపై ఒకసారి యువత ఆలోచించాలని కోరారు.

తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను విలీనం చేసుకుని మెజార్టీ సీట్లు పొందేందుకే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రస్తుతం హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నవాళ్లు హైదరాబాద్‌కు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రలో ఆందోళనలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఉద్యమాల వల్ల సీమాంధ్ర, తెలంగాణలో అనేక మంది చనిపోయారన్నారు. దీనికి కాంగ్రెసు పార్టీయే కారణమని చంద్రబాబు విమర్శించారు.
తెలుగుజాతి తలవంచుకునే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. సోనియా చేతిలో ప్రధాని కీలుబొమ్మలా మారారని, లక్షల కోట్లు అవినీతి జరుగుతున్నా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. అవినీతి, ప్రస్తుత పరిస్థితులపై విద్యార్థులకు ఆవేశం రావాలని, అవినీతిపై మాట్లాడకుండా కూర్చోవడం సరికాదని ఆయన అన్నారు. అభివృద్ధిలో తనను నితీష్ కుమార్, నరేంద్ర మోడి అనుసరించారని ఆయన చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications