రెచ్చగొట్టొద్దు: బంద్, ఎపిఎన్జీవోల సభలపై జానా విజ్ఝప్తి
హైదరాబాద్: బంద్, ఎపిఎన్జీవోల బహిరంగ సభల నేపథ్యంలో ఇరు ప్రాంతాలవారు రెచ్చగొట్టుకోవద్దని, సంయమనం పాటించాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి విజ్ఝప్తి చేశారు. బంద్‌ను గానీ, బహిరంగ సభను గానీ ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆయన కోరారు. ఇరు పక్షాలవారు కూడా రెచ్చగొట్టే పద్ధతిలో వ్యవహరించకూడదని ఆయన సూచించారు. సభకు అనుమతి ఇవ్వడం సరైందా, కాదా అనే విషయం జోలికి గానీ బంద్ నిర్వహించడం సమంజసమా, కాదా అనే విషయానికి గానీ తాను వెళ్లడం లేదని ఆయన అన్నారు.
మరో తెలంగాణ ప్రాంత మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో కలిసి ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కాంగ్రెసు పార్టీ తరఫున తాను ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు జానా రెడ్డి తెలిపారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం అకస్మాత్తుగా తీసుకోలేదని, విస్తృతమైన సంప్రదింపుల తర్వాతనే నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అభ్యంతరం లేదని తెలుగుదేశం, సిపిఐ, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు లేఖలు ఇచ్చాయని ఆయన అన్నారు. ఏళ్లుగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం లేదని కాంగ్రెసును లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెసు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రజలు కూడా కాంగ్రెసు పట్లనే నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారని ఆయన అన్నారు.

చారిత్రక సత్యాన్ని, 56 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు వెల్లడిస్తున్న ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని సిడబ్ల్యుసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని, దాన్నే ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడిందని, పరిస్థితులను అన్నింటినీ గమనించే కాంగ్రెసు నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. కాంగ్రెసు నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీలు కొన్ని ద్వంద్వ ప్రమాణాలతో మాట్లాడడం బాధాకరమని జానా రెడ్డి అన్నారు. ఏళ్ల తరబడి సంప్రదింపులు జరిపిన విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
తెలుగు ప్రాంతం సామరస్యంగా విడిపోయి తెలుగు ప్రజలుగా కలిసి ఉండడానికి సామరస్యపూరితంగా వ్యవహరించడం మంచిదని ఆయన అన్నారు. రెవెన్యూ, నీళ్లు, ఉద్యోగాలు, విద్య వంటి విషయాల్లో సమస్యలు ఉంటే వాటిని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. నెల రోజులుగా పరిస్థితులపై అవగాహన కలిగించకుండా ఆవేశపడుతున్నారని, ఆ ఆవేశానికి కొంత మంది ఆజ్యం పోస్తున్నారని ఆయన అన్నారు. రేపటి సభను అడ్డుకుంటామని కొందరు, నిర్వహించి తీరుతామని కొందరు ఆవేశకావేషాలతో మాట్లాడుతున్నారని, వాటిని దూరం పెట్టాలని ఆయన అన్నారు.
సభను నిర్వహించేవారు గానీ బంద్‌ను తలపెట్టినవారు గానీ బాధను వ్యక్తం చేయడానికి మాత్రమే పరిమితం కావాలని, పరస్పరం రెచ్చగొట్టుకోవద్దని ఆయన కోరారు. సమస్యలను తెలియజెప్పడానికే తప్ప ఆధిపత్యం ప్రదర్శించడానికి కాదనే విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. ఎపిఎన్జీవోలు సబను పూర్తి చేసుకోవాలని, ప్రశాంతంగా పూర్తి చేసుకోవడమే విజయం సాధించినట్లు అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications