టినేతలకు జగ్గారెడ్డి చిక్కు: కిరణ్ పార్టీయా, జగన్‌వైపా?
హైదరాబాద్: సిడబ్ల్యూసి విభజన నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా వేడెక్కించగా.. తాజాగా ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గా రెడ్డి) తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులకు కొత్త చిక్కు తెచ్చారు! మరోవైపు, కాంగ్రెసు పార్టీ విభజనపై ముందుకుపోతే ఏం చేయాలనే విషయమై సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతల విషయంలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెసు పార్టీ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తన స్థానంలో అమరవీరుల కుటుంబాలలో ఒకరిని నిలబెట్టాలనే యోచనలో ఉన్నారట. జగ్గా రెడ్డి ఈ నిర్ణయం ఇతర టి నేతలను చిక్కుల్లో పడేసేదేనని చెప్పవచ్చు. గతంలో తెలంగాణవాది అయిన అతను ఇటీవల సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నారు.

అయితే, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయననే సంచలన నిర్ణయాన్ని ఆయన అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు. అమరవీరులకు తన స్థానాన్ని కేటాయిస్తానని ఆయన చెబితే, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం, కాంగ్రెసు, బిజెపి నేతలు ఇరుకున పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే టిటిడిపి నేతలు.. తాము అమరవీరులను పోటీ చేయించేందుకు సిద్ధమని గతంలో ప్రకటించారు.
జగ్గారెడ్డి నిర్ణయం తీసుకుంటే టిటిడిపి నేతలు కొన్నిసీట్లను అమరవీరులకు కేటాయించే అవకాశాలు లేకపోలేదు. తద్వారా మిగతా వారిపై తెలంగాణవాదులు ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. అమరవీరుల కుటుంబాలు పోటీ చేసే చోట ఎవరైనా పోటీ చేస్తే దానిని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేరు కూడా. మరోవైపు అధిష్టానం విభజనపై ముందుకే వెళ్తే సీమాంధ్ర కాంగ్రెసు నేతలు ఏం చేస్తారనే విషయమై చర్చ జరుగుతోంది.
ఇప్పటికే పలువురు నేతలు కొత్త పార్టీ పుట్టుకు వచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు, కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి తదితరులు గతంలో పలుమార్లు కొత్త పార్టీపై స్పందించారు. దీంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోనే కొత్త పార్టీ పుట్టుకు రావొచ్చునని చెబుతున్నారు. ఈ రోజు మంత్రి టిజి వెంకటేష్ మాట్లాడుతూ.. కొత్త పార్టీతో పాటు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తామని చెప్పారు.
అయితే, సీమాంధ్ర కాంగ్రెసు నేతల కొత్త పార్టీ సాధ్యం కాకపోవచ్చునని, కొందరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వెళ్లే అవకాశాలున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విభజన నిర్ణయం తర్వాత ఇప్పటికే ముగ్గురు నలుగురు ఆ పార్టీ వైపు వెళ్లారని ఇంకొందరు జగన్ గూటికే చేరుతారని చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెసు నేతలు బయటకు వచ్చిన కొత్త పార్టీ పెట్టినా ప్రజలు నమ్మే అవకాశాలు తక్కువే అంటున్నారు. ఈ నేపథ్యంలో వారు చూసే ప్రత్యామ్నాయం జగన్ పార్టీయే అంటున్నారు.












Click it and Unblock the Notifications